Congress Government in Telangana | హైదరాబాద్: బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో 2014లో 1347 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోగా, 2023 నాటికి ఆ సంఖ్య కేవలం 56కి పడిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ (తెలంగాణ రాష్ట్ర సమితి) పాలనతో ఇది సాధ్యమైందని, 2014లో రైతు ఆత్మహత్యలలో తెలంగాణ దేశవ్యాప్తంగా రెండో స్థానంలో ఉన్నప్పటికీ, 2023 నాటికి 14వ స్థానానికి పడిపోయిందన్నారు. దేశ వ్యాప్తంగా 2023లో 10,786 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా, అందులో తెలంగాణ రాష్ట్రం వాటా కేవలం 0.51% మాత్రమే అని కేంద్ర గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు.
కేసీఆర్ పాలనలో 95.84% తగ్గుదలఈ 10 సంవత్సరాల్లో కేసీఆర్ సీఎంగా బీఆర్ఎస్ పాలనలో రైతు ఆత్మహత్యలు 95.84% తగ్గాయి. ఇది మాటలు మాత్రమే కాదు, అధికారిక గణాంకాలు, కేసీఆర్ హయాంలో రైతుల ప్రగతిని నిరూపించే వాస్తవాలని హరీష్ రావు తెలిపారు. రైతులకు అందించిన సంక్షేమ పథకాల ఫలితంగా రాష్ట్రం వ్యవసాయరంగంలో ఘన విజయాలు సాధించింది.
తమ పథకాలు రైతుల జీవితాలు మార్చాయన్న హరీష్ రావురుణమాఫీ: రైతులకు రుణమాఫీ పథకం ధీమాను ఇచ్చింది, మున్ముందు సాగు చేయడానికి నమ్మకాన్ని ఏర్పరచింది.
రైతు బంధు: రైతులకు నేరుగా ఆర్థిక సహాయం చేయడం, వ్యవసాయ రంగానికి ఊతమిచ్చింది
రైతు బీమా: రైతుల జీవితానికి, వ్యవసాయానికి గట్టి భరోసా ఇచ్చింది.
24 గంటల ఉచిత విద్యుత్తు: సాగునీటి కోసం 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించడం రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది.
పంట కొనుగోళ్లతో ప్రోత్సాహం: రైతులకు పంట కొనుగోళ్లలో వారిలో ప్రోత్సాహం, అధిక ధరలను అందించడం ఆయా పంటలకు అధిక ఆదాయం తీసుకొచ్చాం
కాళేశ్వరం ప్రాజెక్టు: సాగునీటి కొరతను తగ్గించడంలో కీలకంగా మారిన వరప్రదాయని
మిషన్ కాకతీయ: చెరువుల పునరుద్ధరణతో నీటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడం సాధ్యమైంది.
భూగర్భ జలాలు: జల వినియోగాన్ని పెంచి, సాగులో పునరుద్ధరణ తీసుకొచ్చింది.
ఉమ్మడి తెలంగాణలో పాలన – రైతులకు తీవ్ర నష్టంఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ పాలనలో సాగు విధ్వంసమైంది. వలసల దుస్థితి, ఎల్లప్పుడూ కరువే, రైతుల ఆత్మహత్యలు పెరగగా.. కేసీఆర్ పాలనలో సాగు రంగం మలుపు తీసుకుంది. అప్పటివరకు సాగు సమస్యతో బాధపడుతున్న రైతుల జీవితంలో వెలుగులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు.
ఆహార ఉత్పత్తి లో దేశానికే ఆదర్శంబీఆర్ఎస్ సంక్షేమ పథకాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అన్నదాతల ప్రయోజనాలు, పంట ఉత్పత్తులతో దేశానికి ఆదర్శంగా నిలిచింది. తెలంగాణను "అన్నపూర్ణ"గా మార్చిన కేసీఆర్, ఇప్పుడు దేశం మొత్తంలో రైతుల సంక్షేమానికి తీసుకున్న చర్యల ద్వారా ఆదర్శంగా నిలిచారని హరీష్ రావు వివరించారు.
కేసీఆర్ పాలనలో రైతులకు ఏమి చేసిందో తెలిపే పథకాలు ఇవి. కానీ కాంగ్రెస్ కు మాత్రం "ఓటు బంధం" మాత్రమే అన్నట్లుగా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనతో దగ్గిన రైతుల ఆత్మహత్యలు, నేడు కాంగ్రెస్ పాలనతో భారీగా పెరిగాయని.. అన్నదాతల ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.