Etela Rajender: తెలంగాణలో జూన్-11న జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్-1 పరీక్ష మళ్ళీ నిర్వహించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంప పెట్టు లాంటిదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గులేదన్నారు. 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటుందని ధ్వజమెత్తారు. అసలు తెలంగాణ ఉద్యమం పుట్టిందే ఉద్యోగాల కోసమని అన్నారు. 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమంలో ఏడు మంది మరణించారని, 1969 ఉద్యమంలో 369 మంది చనిపోయారని, మలిదశ ఉద్యమంలో కూడా అనేక మంది అమరులయ్యారని అన్నారు.






తెలంగాణ వచ్చిన తర్వాత కాంట్రాక్టు ఉద్యోగులను, అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని, గెలిచిన తరువాత వాటిని గాలికి వదిలేశారని ఈటల విమర్శించారు. కొత్త ఉద్యోగాలు నింపుతామని, ప్రైవేట్‌లో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఒకటి నెరవేర్చలేదన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగుల భర్తీ కోసం నోటిఫికేషన్లు వేస్తే 17 పేపర్లు లీక్ చేసి వారి నిజస్వరూపాన్ని బయట పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయడం ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిదన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ మేల్కొని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. ఎన్నికలు అంటే పైసలు, మద్యం పంచడం కాదన్నారు. కేసీఆర్ వచ్చిన తర్వాత తెలంగాణకు ఒరగట్టింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. టీఎస్పీఎస్సీని రద్దు చేయాలని, గ్రూప్ 1 పరీక్ష రద్దుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఎం రాజీనామా చేయాలన్నారు.


తెలంగాణలో ప్రతీష్టాత్మకంగా నిర్వహించిన టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష మళ్లీ రద్దు అయింది. తాజాగా దీనికి సంబంధించి హైకోర్టు శనివారం కీలక తీర్పు ఇచ్చింది. తెలంగాణలో జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ ఇటీవల దాఖలైంది. ఈ పిటిషన్ పై చారణ చేపట్టిన హైకోర్టు శనివారం కీలక ఆదేశాలను జారీ చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రాష్ట్రవ్యాప్తంగా 2,33,248 మంది రాసిన సంగతి తెలిసిందే.


రద్దు ఎందుకు..?
గత ఏడాది (2022) అక్టోబర్ 16న టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష నిర్వహించింది. ప్రశ్నాపత్రాలు లీకేజీ వ్యవహారం బయట పడగా.. టీఎస్పీఎస్సీ వాటిని రద్దు చేసింది. తాజాగా రెండో సారి గ్రూప్ 1 పరీక్షను ఈ ఏడాది (2023) జూన్ 11న నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 994 కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. పరీక్షకు 3,80,081 మంది దరఖాస్తు చేసుకోగా 2,33,248 మందే హాజరయ్యారు. హాజరు శాతం 61.37గా నమోదైంది. అన్ని పరీక్ష కేంద్రాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధలను కఠినంగా అమలు చేశారు. గత గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థుల బయోమెట్రిక్‌ తీసుకోగా ఈసారి అలా చేయలేదు. 


దీంతో జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 పరీక్ష రద్దు చేయాలని ముగ్గురు అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకుండా, హాల్టికెట్ నంబర్, ఫొటో లేకుండానే ఓఎమ్మార్ షీట్ ఇచ్చారని ఆ ముగ్గురు పిటిషన్‌‌లో పేర్కొన్నారు. గ్రూప్-1 పరీక్ష మళ్లీ నిర్వహించాలని పిటిషన్‌లో కోర్టును అభ్యర్థించారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తుది తీర్పును రిజర్వ్‌లో పెట్టింది. నేడు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని తీర్పు ఇచ్చింది. మళ్లీ గ్రూప్ 1 పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలని టీస్పీఎస్సీని ఆదేశించింది.