Etela Rajender about Crop Loan Waiver in Telangana | వరంగల్: తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని, లక్షల మంది రైతులను లబ్దిదారుల జాబితా నుంచి తొలగించారని మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కేవలం కేసీఆర్ ను ఓడించాలని భావించి, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. అంతేగానీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు చేస్తారని, ప్రజలు కాంగ్రెస్ కు ఓటు వేయలేదని అన్నారు. 


ఎస్ఎల్‌బీసీ 71 లక్షలు, ప్రభుత్వం లెక్కలో 64 లక్షలు


వరంగల్ లో పర్యటిస్తోన్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎస్ఎల్బీసీ లెక్కల ప్రకారం తెలంగాణలో 71 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్నారని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్‌బీసీ లెక్కలను పక్కనపెట్టారు. కేవలం 64 లక్షల మందికి రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి, చివరికి లబ్దిదారుల సంఖ్యను 49 లక్షలకు కుదించారు. విధివిధానాల పేరుతో రుణాలు తీసుకున్న రైతులపై అనేక ఆంక్షలు విధించారు. కానీ రైతు రుణమాఫీని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటోందని’ మండిపడ్డారు.


రైతుల రుణమాఫీ విషయానికి వచ్చేసరికి ప్రచారానికి తగ్గట్టు రుణమాఫీ జరగడం లేదని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రైతు రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో 11 లక్షల 50 వేల మందికి రుణమాఫీ కావాలన్నారు. అందుకోసం 6,094 కోట్ల రూపాయలను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి విడుదల చేశారు. అనంతరం రెండో విడతలో రుణమాఫీలో భాగంగా రూ.1 లక్షా 50 వేల లోపు రుణమాఫీకి 18 లక్షల మంది లబ్దిదారులున్నారు. వీరికి రుణమాఫీ కోసం 6000 కోట్లు విడుదల చేశారని ఈటెల పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రైతు రుణమాఫీ మొదటి, రెండో విడత ప్రక్రియలో చాలా మంది రైతులకు అన్యాయం జరిగిందని ఈటెల రాజేందర్ ఆరోపించారు. 


49 లక్షల మందికి రుణమాఫీ ఎలా ? 
మూడో విడతతో కలుపుకొని మొత్తంగా 22 నుండి 23 లక్షల మందికి మాత్రమే రుణమాఫీకి అర్హులయ్యారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినట్టు 49 లక్షల మందికి రుణమాఫీ ఎలా జరుగుతుందో చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు. కాంగ్రెస్ రుణమాఫీ చేసేశామని ప్రచారం చేసుకుంటుంటే, మరోవైపు రుణమాఫీ డబ్బులు అకౌంట్లో పడక.. వడ్డీ డబ్బులు కూడా కట్టడం లేదంటూ బ్యాంకులు రైతులను అడుగుతున్నాయని చెప్పారు. రుణమాఫీ జరగక, అయోమయంలో వేలాది రైతులు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని ఈటల అన్నారు.


రేషన్ కార్డు ఆధారంగా, ఐటీ రిటర్న్స్ పేరుతో, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు అంటూ భారీ సంఖ్యలో రైతులకు రుణమాఫీలో కోతలు పెట్టారని ఈటల విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ రైతు బంధు పేరుతో రూ.5 వేలు ఇస్తే, తాను రూ.7,500 ఇస్తానని చెప్పి.. ఖరీఫ్ మూడు నెలలు కావొస్తున్నా రైతులకు డబ్బులు అందలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో విజయం కోసం 6 గ్యారంటీలు, 66 హామీలు, 420 పనులు చేస్తామని చెప్పారంటూ   ఈటల విమర్శించారు. ఎన్నికల హామీలు నెరవేర్చకుండా, ప్రజల్ని తప్పు దోవ పట్టించేలా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. హామీ ఇచ్చినట్లుగా అందరికీ రుణమాఫీ జరగకపోతే, రైతులతో కలిసి బీజేపీ పోరాడుతుందని ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.