Telangana News :  పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ బీజేపీలో చేరడం కష్టమేనని..   బిజెపి రాష్ట్ర చేరిక‌ల క‌మిటీ ఛైర్మ‌న్ ,హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు..హైద‌రాబాద్ లో ఆయ‌న మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఈ సంసందర్భంగా ఆయన వారితో చర్చల గురించి వివరించారు.  ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌ బలంగా ఉంది. బిజెపి లేదు. పొంగులేటి, జూపల్లితో నేను రోజూ మాట్లాడుతున్నాను. వారే నాకు రివర్స్‌ కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. బిజెపిలో చేరేందుకు వారికి కొన్ని ఇబ్బందులున్నాయని చెప్పుకొచ్చారు.  ఇప్పటివరకు వారిద్దరూ కాంగ్రెస్‌లో చేరకుండా మాత్రమే ఆపగలిగానని.. కానీ బీజేపీలోకి తీసుకు రాలేకపోయానని ఈటల  చెప్పుకొచ్చారు.  దీంతో పొంగులేటి, జూప‌ల్లి ఇద్ద‌రూ కూడా కాంగ్రెస్ లో చేర‌నున్న‌ట్లు ప‌రోక్ష సంకేతాలు ఇచ్చిన‌ట్ల‌యింది..


బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుని.. కాంగ్రెస్, బీజేపీ రెండూ ఆకర్షిస్తున్నాయి. ఖమ్మంలో కాస్తో కూస్తో బలం ఉన్న ఆ ఇద్దరిని తమ జట్టులో కలుపుకోడానికి ఉబలాటపడుతున్నాయి. అయితే బీజేపీ నుంచి ఈటల ఓ అడుగు ముందుకేశారు. నేరుగా తానే వెళ్లి రెండుసార్లు వారిద్దరితో చర్చించారు. కానీ వర్కవుట్ కావడం లేదు.  ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జూపల్లి.. ఎవరికి వారే బాగా పట్టున్న నేతలుకావడంతో వారిద్దరినీ పార్టీలో చేర్చుకోవటం వల్ల వచ్చే ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ నాయకత్వం  చాలా ఆఫర్లు ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.  అయితే అప్పటికప్పుడు జెండా కప్పుకోకుండా కర్ణాటక ఎన్నికల ఫలితాల వచ్చాక తుది నిర్ణయం తీసుకుంటామని ఈటల బృందానికి పొంగులేటి హామీ ఇచ్చారు. బీజేపీకి వ్యతిరేక ఫలితం రావడంతో ఇక  బీజేపీలో చేరిక గురించి మర్చిపోయారు.                  
 
ఫలితాల తర్వాత మాత్రం కాంగ్రెస్‌ వైపే పొంగులేటి , జూపల్లి అడుగులు కూడా పడుతున్నాయన్న ప్రచారం జరిగింది.,   కాంగ్రెస్‌కే జై కొట్టాలని ఇద్దర నేతల అనుచరులు కూడా పట్టుబడటంతో ఆ మేరకు తుది నిర్ణయానికివచ్చినట్టు సమాచారం. వాస్తవానికి ఇంతకు ముందే ఇద్దరూ కాంగ్రెస్‌ జెండా కప్పుకోవాలి. ప్రియాంక గాంధీ హైదరాబాద్‌ పర్యటనలో కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని అనుకున్నారు.   అయితే అప్పట్లో బీజేపీ నేతలు వత్తిడి తీసుకురావడంతో ఆలోచన వాయిదా పడ్డప్పటికీ ఇక ఇదే ఫైనల్‌ డెసిషన్‌ అంటున్నారని అంటున్నారు. జూపల్లి, పొంగులేటి మాత్రమే కాదు బీజేపీలో చేరాలని చాలా మంది నేతలు ఉత్సాహపడుతున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.                      


టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పొంగులేటి, జూపల్లి కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని గట్టి నమ్మకంతో ఉన్నారు. వారు వారు బీజేపీలో చేరరని అంటున్నారు. అంతే కాదు ఇతర నేతలందర్నీ కూడా కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో ఈటల రాజేందర్ ను కూడా పిలుస్తున్నారు. ఏలా చూసినా ..  చేరికల కమిటీ చైర్మన్ ఈటల వారిద్దర్నీ  బీజేపీలోకి ఆకర్షించడంలోకి విఫలమయ్యారు. మరి ఈటల చెప్పినట్లుగా వారి రివర్స్ కౌన్సెలింగ్ వారిపై ఏమైనా ప్రభావం చూపిందో లేదో త్వరలోనే తేలనుంది.