News From Telangana: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. త్వరలో రైతు, విద్యా కమిషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. పౌరసంఘాల ప్రతినిధులతో ఇవాళ రేవంత్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. పంటల బీమా పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని తెలిపారు. కౌలు రైతుల రక్షణ కోసం చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో ఉన్నామని స్పష్టం చేశారు. పంట మార్పిడికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించామన్నారు. రైతు, విద్యా కమిషన్లు త్వరలోనే ఏర్పాటు చేస్తామని, విద్యా విధానం ఎలా ఉండాలనేది కమిషన్ నిర్ణయిస్తుందని తెలిపారు. 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఏర్పాటు చేయనున్నట్లు రేవంత్ తెలిపారు.


కౌలు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం 
పైలట్ ప్రాజెక్టుగా కొడంగల్‌లో సమీకృత గురుకుల వర్సిటీ సముదాయం ఏర్పాటు చేయనున్నట్లు సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ధర్నా చౌక్, ప్రజా భవన్ అందుబాటులోకి తెచ్చామని అన్నారు. గత ప్రభుత్వంలోని చిక్కుముడులు తొలగించి ఉద్యోగాలు భర్తీ చేశామని, యూపీఎస్సీ తరహాలో టీఎస్‌పీఎస్సీ నియామకాలు చేపడుతున్నామన్నారు. కౌలు రైతుల సమస్యలపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్న రేవంత్.. రైతు భరోసా ఎవరికి ఇవ్వాలనే దానిపై చర్చ జరగాలని వ్యాఖ్యానించారు.


ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం 
శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకంలో రైతులు కొంత ప్రీమియం చెల్లించి చేరాల్సి ఉంటుంది. ప్రకృతి వైపరీత్యాలు, ఊహించని సంఘటనల వల్ల పంటకు నష్టం జరిగినప్పుడు బీమా తీసుకున్న వ్యక్తికి పరిహారం చెల్లిస్తారు. 2016 జూన్ నుంచి మోదీ సర్కార్ ఈ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని పక్కన పెట్టింది. 2020లో ఈ పథకం నుంచి బీఆర్ఎస్ సర్కార్ బయటకొచ్చింది. రైతులు ప్రీమియం చెల్లించడం వల్ల వారిపై భారం ఎక్కువ పడుతుందనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం అప్పట్లో పథకం నుంచి బయటకు వచ్చింది.  దీంతో రైతులు ఆకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా ఎలాంటి పరిహారం అందటం లేదు. కేసీఆర్ సర్కార్‌పై  ఎన్ని విమర్శలు వచ్చినా ఆ పథకాన్ని మళ్లీ తీసుకురాలేదు.  రాష్ట్రంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రైతుల శ్రేయస్సు కోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది రైతులకు గుడ్ న్యూస్‌గా చెప్పవచ్చు. 


అటు గత కేసీఆర్ ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. రైతులు ఏదైనా కారణాల వల్ల హఠాన్మరణం చెందితే వారి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రైతుల తరపున ప్రభుత్వమే బీమా మొత్తం చెల్లిస్తుంది. దీని వల్ల రైతులపై ఎలాంటి భారం పడదు. కానీ ఈ పథకాన్ని కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయలేదు. దీంతో కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలొచ్చాయి. రైతుబంధు ఇస్తున్నానని చెప్పుకుంటున్న కేసీఆర్.. రైతు బీమా, పంట బీమా పథకాలను అమలు చేయడం లేదంటూ ఆరోపించారు. ప్రతిపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా రైతుబీమా, పంట బీమా పధకాలను కేసీఆర్ అమలు చేయలేదు.