బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను హత్య చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని ఆయన భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఈ కుట్ర పన్నారని, ఈటల హత్య కోసం రూ.20 కోట్లు ఖర్చు పెడతానని కౌశిక్ రెడ్డి అన్నట్లుగా ఈటల జమున ఆరోపించారు. కేసీఆర్‌ ప్రోత్సాహంతోనే కౌశిక్‌ రెడ్డి చెలరేగిపోతున్నాడని ఆరోపణలు చేశారు. మహిళలపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చెప్పుల దండ వేస్తారని కౌశిక్‌ రెడ్డిపై ఈటల జమున ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలోఈటల జమున మాట్లాడారు.


ఇటీవల కౌశిక్ రెడ్డి అరాచకాలుచేస్తున్నారని జమున ధ్వజమెత్తారు. ఈటలను చంపేస్తామంటే మేం భయపడిపోం. కౌశిక్‌ రెడ్డి మాటల వెనక సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఓటుతో ప్రజలు కేసీఆర్‌కు బుద్ధి చెప్తారు. కౌశిక్‌ రెడ్డి రూపంలో వ్యక్తిని సీఎం కేసీఆర్‌ హుజూరాబాద్‌ ప్రజలపైకి వదిలారని అన్నారు. ప్రస్తుతం ఆయన హుజూరాబాద్‌లో అరాచకాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. అమరవీరుల స్తూపాన్ని కూడా కౌశిక్‌ రెడ్డి కూలగొట్టించారని అన్నారు. మా కుటుంబంలో ఎవరికి హాని జరిగినా దానికి కేసీఆరే కారణం అని ఈటల జమున తెగేసి చెప్పారు. హుజూరాబాద్ టికెట్ కౌశిక్ రెడ్డికి ప్రకటించిన తర్వాత అరాచకాలు ఎక్కువయ్యాయని ఈటల జమున అన్నారు.


తన భర్త ఈటల రాజేందర్ పార్టీ మారుతున్నారన్నది అవాస్తవం అని స్పష్టత ఇచ్చారు. బీజేపీలో ఈటలకు ప్రాధాన్యత లేదనేది అవాస్తవం అని అన్నారు. పదవుల కోసం ఈటల రాజేందర్ తల వంచరని, దేనీకి పాకులాడబోరని అన్నారు. తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని స్పష్టం చేశారు.


ఆయనొక పిచ్చి కుక్క - ఈటల జమున 


‘‘తెలంగాణ ఉద్యమకారులంటే మొదట వినిపించే పేరు ఈటల రాజేందర్. మా కుటుంబ సభ్యులది ఒక్క రక్తపు బొట్టు కారినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కౌశిక్ రెడ్డి ఓ పిచ్చికుక్క. ఆ పిచ్చి కుక్కను కేసీఆర్ ఎమ్మెల్సీని చేసి హుజూరాబాద్ ప్రజల మీదకు వదిలారు. హుజురాబాద్‌లో అతని అరాచకాలు పెరిగిపోయాయి. హుజూరాబాద్ ప్రజలు, మహిళల పట్ల ఇష్టారీతిన మాట్లాడుతున్నారు. అమరవీరుల స్థూపాన్ని ఉద్యమంలో లేని పిచ్చికుక్క కూల్చివేయించాడు. ఆ స్థూపం తాకే అర్హత కౌశిక్‌ రెడ్డికి లేనేలేదు. అమర వీరుల స్థూపం పునర్నిర్మాణం కోసం ఉద్యమం చేస్తాం. శిలాఫలకంపై ఈటల రాజేందర్ పేరు ఉండకూడదన్న ఉద్దేశంతోనే కౌశిక్ రెడ్డి కూల్చి వేయించారు. అమరవీరుల స్థాపాన్ని కూల్చిన వ్యక్తిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. మహిళా గవర్నర్‌ను ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం చర్యలు తీసుకోలేదు. 


హుజూరాబాద్‌ను మంత్రి కేటీఆర్ కౌశిక్ రెడ్డికి అప్పజెప్పాలని చూస్తున్నారు. ఈటల రాజేందర్ పుణ్యం వల్లే కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. హుజురాబాద్ కో-సర్పంచ్‌లపై కౌశిక్ అక్రమ కేసులు పెట్టిస్తున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెడతారన్న నమ్మకంతో హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్ ను గెలిపించారు. ఇప్పుడు గుర్తింపు కోసం ఈటలను కౌశిక్‌రెడ్డి తిడుతున్నారు.’’ అని ఆరోపించారు.