Night Temperatures: తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చలి తీవ్రత మొదలైపోయింది. శీతాకాలం సమీపించిన వేళ చలి వణుకు పుట్టిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం పలు చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీల నుంచి 6.2 డిగ్రీల వరకు పడిపోయాయి. ఫలితంగా రాష్ట్రంలో చలి వాతావరణం పెరిగిపోయింది. హన్మకొండ పట్ణణం ఒక్కసారిగా చలికి వణికిపోయింది. అక్కడ సోమవారం రాత్రి ఏకంగగా 6.2 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత పడిపోయింది. ఇక్కడ రాత్రిపూట 22.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావాల్సి ఉండగా.. సోమవారం రాత్రి 16 డిగ్రీల సెల్సియస్‌ నమోదైంది.


రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. రాత్రి పూట కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోయాయి. విశ్వ నగరం హైదరాబాద్‌లో సాధారణం కన్నా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గింది. రాజేంద్రనగర్‌లో సాధారణంగా 19 డిగ్రీలు నమోదవ్వాల్సి ఉండగా కేవలం 16.5 డిగ్రీలు నమోదైంది. ఒకే రోజు రాత్రి 2.5 డిగ్రీలు పడిపోయింది. పటాన్‌చెరులలోనూ ఇదే పరిస్థితి. సాధారణంగా 18.7 డిగ్రీలు నమోదవ్వాల్సి ఉండగా 4.1 డిగ్రీలు పడిపోయి 14.6 డిగ్రీలు నమోదైంది. 


మెదక్‌లో 19.4 డిగ్రీలు నమోదవ్వాల్సి ఉండగా 3.6 డిగ్రీలు పడిపోయింది. 15.8 డిగ్రీలలు నమోదైంది. ఆదిలాబాద్‌, రామగుండం, ఖమ్మంలలోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గాయి. అదిలాబాద్‌లో 19 డిగ్రీలు నమోదవ్వాల్సి ఉండగా 16.2 డిగ్రీలు నమోదైంది. 2.8 డిగ్రీల ఉష్ణోగ్రత పడిపోయింది. అలాగే రామగుండంలో 20.8 డిగ్రీలు నమోదవ్వాల్సి ఉండగా 18.6 డిగ్రీలు నమోదైంది. రామగుండంలో 20.8 డిగ్రీలకు గాను 2.2 డిగ్రీలు పడిపోయి 18.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రంగారెడ్డి జిల్లా మెయినాబాద్‌ లో 14 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్, మౌలాలి ప్రాంతాల్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. 


పగలు వేడి, రాత్రి చలి
ఇదే సమయంలో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో గణనీయ మార్పులు ఉంటున్నాయి. పలు ప్రాంతాలు పగటి పూట తీవ్ర వేడి, రాత్రి చలి వాతావరణం ఉంటోంది. హైదరాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో పగటి పూట సాధారణం కంటే కొంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మంగళవారం ఖమ్మంలో పగటిపూట సాధారణం కన్నా 3.8 డిగ్రీలు అధికంగా 35.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే భద్రాచలంలో 1.7, హైదరాబాద్‌లో 1.3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే రాత్రి సైతం ఉష్ణోగ్రతల్లో తీవ్ర మార్పులు ఉంటున్నాయి. 


ఉత్తర దిశ నుంచి గాలులు
ఉత్తర దిశ నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా చలి గాలుల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని అన్నారు. అక్టోబరు 31 వతేదీన తేలికపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.  


నవంబర్‌ కంటే ముందే పడిపోతున్న ఉష్ణోగ్రతలు
వర్షాకాలం ముగియడంతో తెలంగాణలో క్రమంగా చలి పెరుగుతోంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ ఏడాది కూడా తెలంగాణలో మంచి వర్షాలు కురిశాయి. ఫలితంగా చెరువు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. ఫలితంగా నవంబర్ మాసం రాకముందే ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్టోబర్ చివరి వారం నుంచే చలి తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాయంత్రం 6 గంటలు కూడా కాకుండానే చలి పెరుగుతోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది.