SIB Ex DSP Praneeth Case  : SIB మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావ్‌ ను సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్ లో పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ల కాల్స్ ను ట్యాప్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రణీత్‌రావ్‌ను  అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతనిపై ఐపీసీ 409,427,201 సహా ఐటీ ఆక్ట్ సెక్షన్ 65,66,70 ప్రకారం వివిధ కేసులు నమోదు చేశారు.ప్రణీత్ రావ్ ఎవరి ఫోన్లను ట్యాప్ చేశాడో తెలుసుకునేందుకు.. వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రీట్రీవ్ చేస్తున్నారు. గత BRS ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాపింగ్‌ చేసినట్లు ప్రణీత్‌రావ్‌పై ఆరోపణలు నేపథ్యంలో.. ఆయనతో పాటు పలువురి కేసులు నమోదు చేశారు అధికారులు. 


ప్రణీత్ రావు కేసును సీఐడీ లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం                             


ముఖ్యంగా ప్రణీత్‌రావు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేసాడనే కోణంలో కీలక సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారుల పాత్రపైనా విచారణ జరుగుతోంది.ప్రణీత్‌రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి.. విచారణ జరపనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రణీత్‌రావు కేసును సీఐడీకి లేదా సిట్‌కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు ట్యాప్ చేసిన ఫోన్లలో అత్యంత కీలకమైన విషయాలు ఉన్నాయని.. చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రతిపక్ష నేతలు డబ్బులు తరలిస్తే.. ఆ విషయం ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని.. ప్రణీత్ రావు .. పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చేవారు. వారు పట్టుకునేవారు. గతంలో పెద్ద ఎత్తున విపక్షాలకు చెందిన వారి నగదు మాత్రమే పట్టుబడేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. 


భారీగా ఆస్తులు కొనుగోలు చేసిన ప్రణీత్ రావు 


ప్రణీత్‌రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్టు గుర్తించారు. అంతేకాదు.. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన ప్రణీత్ రావ్.. డ్యూటీ సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సుమారు 42 హార్డ్ డిస్క్ లను మాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే 1610 పేజీల కాలే డేటాను కూడా తగలబెట్టినట్లు నిర్థారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్ లోని ఫైల్స్, కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటా సహా.. కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈఐ నంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని సైతం ట్రాష్ చేసినట్లు విచారణలో వెల్లడైంది.


ప్రణీత్ రావుకు ఇచ్చిన  ప్రమోషన్‌పై ఫిర్యాదు 


ప్రణీత్‌‌రావు ప్రమోషన్‌ సైతం ఇప్పుడు వివాదస్పదమవుతోంది. అడ్డదారిలో ప్రణీత్‌రావు డీఎస్పీగా ప్రమోషన్ పొందారని.. పోలీసు శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ పై DSP గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు . మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్‌లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయకపోయినా..అడ్డదారిలో డిఎస్పిగా ప్రమోషన్ పొందారని DSP గంగాధర్ ఫిర్యాదు చేశారు.