Kothagudem News : తెలంగాణ హెల్త్ డైరక్టర్ గడల శ్రీనివాసరావు కొత్త గూడెంలో ముగ్గుల పోటీలు పెడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ముగ్గుతో సెల్ఫీ తీసి వాట్సప్ పంపి..బంగారం గెలుచుకోండంటూ ట్వీట్ చేశారు. విజేతకు లక్కీ డ్రా ద్వారా బహుమతులు అందజేస్తామని తెలిపారు. ఇందులో మొదటి 10 మందికి బహుమతిగా ఒక గ్రామ్ గోల్డ్..తర్వాతి 50 మంది విజేతలకు 10 గ్రాముల వెండి నాణెం ఇస్తామని చెప్పారు. అయితే ఇది భద్రాద్రికొత్తగూడెం మహిళలు, యువతులకు మాత్రమే పరిమితం. ఈ ప్రాంతంలో అందరూ ఈ పోటీల్లో పాల్గొని గోల్డ్ కాయిన్ ను గెలుచుకోవచ్చని గడల శ్రీనివాసరావు తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. పండుగకు మీ ఇంటి ముందు మీరు వేసిన ముగ్గుతో సెల్ఫీ లేదా సెల్ఫీ వీడియో తీసి మీ పేరు, గ్రామం, మండలం వివరాలతో జనవరి 15 సాయంత్రం 6 గంటల లోపు వాట్సాప్ చేయాలి. ఇందులో లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేసి విజేతలకు జనవరి 26న కొత్తగూడెంలోని శ్రీనగర్ కాలనీలో సాయంత్రం 5 గంటలకు బహుమతి ప్రదానం చేస్తామని డీహెచ్ ప్రకటన చేశారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త గూడెం నుంచి పోటీ చేయాలని డీహెచ్ శ్రీనివాసరావు అనుకుంటున్నారని అందుకే ఇటీవలి కాలంలో అక్కడే ఎక్కువగా తిరుగుతున్నారన్న వానద వినిపిస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కడం ఓ సందర్భంలో వివాదాస్పదమయింది. అయితే ఈ విషయంలో ఆయన కేసీఆర్ పై భక్తిని ప్రదర్శించారు. ఇదంతా అసెంబ్లీ టిక్కెట్ కోసమేనన్న విమర్శలు కూడా వచ్చాయి. ప్రస్తుతం కొత్తగూడెంలో కాంగ్రెస్ తరపున గెలిచిన బీఆర్ఎస్ లో చేరిన వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు వయసు మీదపడింది. ఆయన రాజకీయ వారసుడు అనేక వివాదాల్లో ఉన్నారు. ఈ కారణంగా అభ్యర్థిని మారుస్తారన్న ప్రచారం ఉంది. దీంతో గడల శ్రీనివాసరావు తన ప్రయత్నాలను ముమ్మరం చేశారని అంటున్నారు.
ఇటీవల క్రిస్మస్ వేడుకలను కూడా ఆయన కొత్తగూడెంలోనిర్వహించారు. కొత్త గూడెం జిల్లాలో డీఎస్ఆర్ ట్రస్ట్ తరపున ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశఆరు. యేసు క్రీస్తు కృప వల్లే కరోనా నుంచి మనం విముక్తి అయ్యామని.., మనం చేసిన సేవల వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఆధునిక సంస్కృతి కానీ.. మన దేశానికి కానీ.. మన రాష్ట్రానికి కానీ..అది కేవలం క్రైస్తవ సోదరులు మాత్రమే వారధులని ఆయన అన్నారు ఈ విషయాన్ని మనమంతా గుర్తు పెట్టుకోవాలని సూచించారు. లేదంటే ప్రపంచంలో భారతదేశం మనుగడ సాధించలేకపోయేదన్నారు. కోవిడ్ క్రీస్తు వల్లే తగ్గిందని అది మనం చేసిన సేవల వల్ల కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.