Revanth Reddy : ప్రధాని మోదీ దేశాన్ని కులాలు, మతాలు, ప్రాంతాలు వారీగా ముక్కలు ముక్కలుగా విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. అక్టోబర్ 2 నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ జోడో యాత్రపై కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. దిల్లీ తెలంగాణ భవన్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రైతులు, నిరుద్యోగులు సహా అన్ని వర్గాల ప్రజల్ని బీజేపీ విధ్వంసం చేస్తుందని విమర్శించారు. అనేక రాష్ట్రాల్లో దళితులు, గిరిజనులు సహా వివిధ వర్గాలపై జరుగుతున్న దాడులను ఎత్తి చూపేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేస్తున్నారన్నారు. దాదాపు 150 రోజులపాటు 3,600 కిలోమీటర్లు కొనసాగుతుందన్నారు. మక్తల్ వద్ద తెలంగాణలో ప్రవేశించి జుక్కల్ మీదుగా నాందేడ్ కు యాత్ర వెళ్తుందన్నారు. తెలంగాణలో రాహుల్ యాత్రను అద్భుతంగా నిర్వహిస్తామన్నారు. పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు సహా అన్ని అనుబంధ విభాగాలను యాత్రలో భాగస్వాములు చేస్తామన్నారు.
రెండు మూడేళ్లు నీళ్లు లిఫ్ట్ అవసరంలేదు
దేశాన్ని కుల మతాల పేరుతో విడగొట్టాలని చూస్తున్న బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా, ప్రజా సమస్యలపై చైతన్యం చేసేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్ట బోతున్నారు. కాంగ్రెస్ అన్ని విభాగాలను ఈ యాత్రలో భాగస్వామ్యం చేసి భారత్ జోడో యాత్రను ముందుకు తీసుకువెళతాం. రాజకీయ అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్షలు జరుపుతున్నారు తప్ప వర్షాలపై సహాయక చర్యలపై సమీక్ష జరపలేదు. 20 అసెంబ్లీ నియోజక వర్గాల్లో వరద ప్రభావం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు నీట మునిగిపోయింది. మరో రెండు మూడేళ్లు నీళ్లు లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. సీఎం కేసీఆర్ అవినీతికి నిదర్శనమైన ప్రాజెక్టు కాళేశ్వరం. కేసీఆర్ నిద్ర మత్తు వదిలి వరద సహాయక చర్యలు ముమ్మరం చేయాలి. -రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
వరదలపై ముందస్తు చర్యలు లేవు
జులై 17న నుంచి ఆదిలాబాద్, వరంగల్,కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ సహాయక బృందాలు పర్యటించి వరద బాధితులకు సహాయం అందజేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. వరద నష్టాన్ని అంచనా వేయడానికి క్షేత్ర స్థాయిలో పర్యటిస్తామన్నారు. 10-12 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టం, ఆర్థిక నష్టంపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. ప్రధాని, హోంమంత్రి తెలంగాణ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాలన్నారు. వరద బాధితులకు కేంద్రం సహాయం అందించాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, వరదలపై ముందస్తు చర్యలు చేపట్టలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. వరదలపై సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ పార్టీ ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉందని కానీ నిర్లక్ష్యం వహించారన్నారు. రాు. సీఎం కేసీఆర్ వైఫల్యం కారణంగానే ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు అన్ని ప్రాంతాలు నీట మునిగాయన్నారు.