Cyber Crime: టెక్నాలజీ పెరిగిపోతోంది. సాంకేతికత అందరి అరచేతుల్లోకి వచ్చేస్తోంది. అదే సమయంలో మోసం చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వాట్సాప్, సోషల్ మీడియా, ఫేస్ బుక్, ఇతర సామాజిక మాధ్యమాల్లో అమాయకులను మోసం చేసేవారు పెరిగిపోయారు. అవగాహనరాహిత్యంతో కొందరు, అత్యాశతో మరికొందరు సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కుకుని లక్షలు, కోట్లు మోసపోతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో అలాంటి ఘటనలు రెండు జరిగాయి. ఇద్దరు వ్యాపారవేత్తలు ఒకే రోజులో కోటి రూపాయలు మోసపోయారు.
క్రిప్టో కరెన్సీ పేరుతో..
హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తల ఖాతాల నుంచి సైబర్ నేరగాళ్లు కోటి రూపాయలు కొల్లగొట్టారు. ఒకరికి క్రిప్టో కరెన్సీ ఎరగా చూపించి రూ.47 లక్షలు దోచుకున్నారు. మరో ఘటనలో పార్ట్ టైమ్ ట్రేడింగ్ చేయడం ద్వారా భారీ లాభాలు పొందవచ్చంటూ ఆశ చూపించి రూ.65 లక్షలు కాజేశారు.
బోరబండకు చెందిన ఓ వ్యాపారికి కొద్ది రోజుల క్రితం గుర్తు తెలియని నెంబర్ నుంచి మెస్సేజ్ వచ్చింది. అందులో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చని ఉండడంతో వ్యాపారి ఆ ఫోన్ నెంబర్‌కు కాల్ చేశాడు. దీంతో సైబర్ నేరగాళ్లు చేతి వాటం ప్రదర్శించారు. క్రిప్టో కరెన్సీ గురించి వివరించారు. వారి మాటలను నమ్మిన వ్యాపారి ఏకంగా రూ.47 లక్షలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. అప్పటి నుంచి లాభాల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే సమాధానం లేకపోవడంతో మెస్సేజ్ వచ్చిన నంబర్‌కు ఫోన్ చేశాడు. సమాధానం లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి బుధవారం పోలీసులను ఆశ్రయించారు.
పార్ట్ టైమ్ ట్రేడింగ్ అంటూ నమ్మించి..
అలాగే సికింద్రాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి సైబర్ నేరగాళ్లు రూ.65 లక్షలు టోకరా వేశారు. పార్ట్ టైమ్ కింద ట్రేడింగ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చని నమ్మించారు. వారిని నమ్మిన వ్యాపారి వారు చెప్పిన ఖాతాలకు రూ.65 లక్షలు బదిలీ చేశారు. ఆ తరువాత వారి నుంచి సమాధానం లేకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆయా ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సైబర్ నేరాలపై పోలీసులు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. లాభాలకు ఆశ పడి క్రిప్టో, ట్రేడింగ్ యాప్‌లను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల వీడియో కాల్స్‌కు స్పందించరాదని, పండుగలకు షాపింగ్ చేసే సమయంలో ఇచ్చే లాటరీ కూపన్‌లకు వ్యక్తిగత వివరాలు ఇవ్వరాదన్నారు.
హైదరాబాద్ సిటీలో ఇలాంటి కేసులు పెరిగిపోతుండటంతో సైబర్ పోలీసులు సోషల్ మీడియా వేదికగా అవగాహన నిర్వహిస్తున్నారు. అయినా ప్రజలు సైబర్ నేరగాళ్లకు చిక్కుతున్నారని అంటున్నారు. ఆన్ లైన్లో ఏ పనైనా చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని చెప్పారు.
సోషల్ మీడియాను నమ్మొద్దు..
సోషల్ మీడియా వేదికగా సైబర్ నేరాగాళ్లు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిచయం లేని వ్యక్తుల నుంచి ఓటిపి పంచుకోకూడదని, పరిచయం లేని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్ స్పందించకూడదని పోలీసులు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తులకు బ్యాంక్ అకౌంట్, ఆధార్, సీవీవీ నెంబర్, యూపీఐ, పాన్ కార్డు వివరాలను షేర్ చేయొద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేయకుండా, గోప్యుంగా ఉంచుకోవాలని సూచించారు. ట్రేడింగ్ జాబ్ లాంటి వాటి నుంచి మోసాలు బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఆన్లైన్ గేమ్స్ కు దూరంగా ఉండాలని తెలియజేశారు.