హైదరాబాద్: తెలంగాణలో రాజకీయంగా వివాదాస్పద అంశాల్లో ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్ట్ అతిముఖ్యమైనది. భారీ ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్టుపై బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య మూడేళ్ల నుంచి మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి మరో కీలక విషయం బయటపడింది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, మరియు సుందిళ్ల బ్యారేజీల దిగువన భూగర్భంలో అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (GPR) పరీక్షలలో తేలింది. బ్యారేజీల కొన్ని వెంట్స్ (నీరు ప్రవహించే మార్గాలు) కింద ఖాళీ ప్రదేశాలు ఏర్పడి నీరు చేరడం (కేవిటీస్), పెద్ద పరిమాణంలో బోల్డర్లు, దెబ్బతిన్న రాతి పొరలు,  రాళ్ల దిగువ భాగాన పూడిక పేరుకుపోవడం వంటి సమస్యలు ఉన్నట్లు  గుర్తించారు. ఈ జియోఫిజికల్ పరిశీలనల ఆధారంగా పుణెలోని ప్రసిద్ధ కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (CWPRS) డైరెక్టరు సెల్వబాలన్ ఒక సమగ్ర నివేదికను తెలంగాణ నీటిపారుదల శాఖకు పంపారు. 

Continues below advertisement

జీపీఆర్ పరీక్షలు చేసిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌3 బ్యారేజీల దిగువన సుమారు 30 మీటర్ల లోతు వరకు భూగర్భంలో ఉన్న పరిస్థితులు, సీపేజీ మార్గాలు, అనామలీస్‌ (భిన్నమైన పరిస్థితులు)ను అధ్యయనం చేయడానికి ఈ అధునాతన జీపీఆర్ పరీక్షలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ నిర్వహించింది. ఈ అధ్యయనంలో భాగముగా మూడు బ్యారేజీల్లోని మొత్తం 225 వెంట్లకు గాను 217 వెంట్స్ వద్ద  క్షేత్రస్థాయి అధ్యయనాలు జరిగాయి. ఈ నివేదికలోని వివరాల ప్రకారం, మేడిగడ్డ బ్యారేజీలోని 7 వెంట్స్ దిగువన అత్యంత తీవ్రమైన అనామలీస్ నమోదయ్యాయి. 

కీలకమైన మేడిగడ్డలోని 7వ బ్లాక్‌కు చెందిన 17, 18, 19, 20, 21 వెంట్లలోనూ, 8వ బ్లాక్‌లోని 7వ వెంట్‌లోనూ, 5వ బ్లాక్‌లోని 35వ వెంట్‌లోనూ ఈ భూగర్భ లోపాలను  గుర్తించినట్లు నివేదికలో తెలిపారు. ఇదే ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీలోని 5వ బ్లాక్‌లో ఉన్న 47వ వెంట్ ఎగువ భాగంలోనూ, సుందిళ్ల బ్యారేజీలో 25, 31, మరియు 53వ వెంట్స్ వద్ద ఎగువ, దిగువ ప్రాంతాలలో సమస్యలు ఉన్నట్లు తేలింది. ఈ 3 బ్యారేజీలలో కలిపి మొత్తం 11 వెంట్స్ కింద మాత్రమే ఎలాంటి సమస్యలు లేదా అనామలీస్ లేవని, మిగతా వాటిలో చిన్న సమస్యలు ఉన్నాయని నివేదికలో వెల్లడించినట్లు సమాచారం. 

Continues below advertisement

Also Read: Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?

నిర్మాణ లోపాలను ఈ పరీక్షలు నిర్ధారించలేదుమేడిగడ్డ వద్ద నీటి ఉధృత ప్రవాహాల కారణంగా ఇసుక కొట్టుకుపోయి, రాఫ్ట్ దిగువన పెద్ద ఎత్తున శూన్య ప్రాంతాలు ఏర్పడ్డాయి. 6 వెంట్స్ వద్ద పదికి పైగా విభిన్నమైన అనామలీస్ జోన్లను శాస్త్రవేత్తలు నమోదు చేశారు. ఇటువంటి పరిస్థితులు నీటి అంతర్గత సీపేజ్, పైపింగ్ వంటి ప్రమాదకర పరిణామాలకు దారితీసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే, జీపీఆర్ పరీక్షలు కేవలం భూగర్భ పరిస్థితులను అంచనా వేయడానికి మాత్రమే పరిమితమని, నేరుగా స్ట్రక్చరల్ లోపాలను ఇవి నిర్ధారించలేవని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. అందువల్ల పునరావాస లేదా మరమ్మతు పనులు ప్రారంభించే ముందు బోర్‌హోల్, కోర్ డ్రిల్లింగ్, ఎలక్ట్రికల్ రెసిస్టివిటీ టోమోగ్రఫీ (ERT) వంటి ఇంజినీరింగ్ పరీక్షలు నిర్వహించడం అనివార్యమని సూచించింది.

ప్రాజెక్టు బ్యారేజీల నిర్మాణ సమయంలో ముందస్తు భూగర్భ అన్వేషణ పరీక్షలు చేపట్టకపోవడం వల్లే ఈ సమస్యలు ముందుగా గుర్తించలేకపోయినట్లు ఇంజినీరింగ్ టీమ్ పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం ఈ నివేదికను బయటపెట్టడం గానీ, మంత్రులు, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారులు గానీ కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ ( సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌) నివేదికపై స్పందిస్తే మరింత క్లారిటీ రానుంది.