Criminal Case Filed on Ktr: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR)కు షాక్ తగిలింది. ఆయనపై బంజారాహిల్స్ (Banjarahills) పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై (CM Revanthreddy) అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు హనుమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారంటూ అసత్య ఆరోపణలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అక్కడి పోలీసులు ఆ కేసును బంజారాహిల్స్ పీఎస్ కు పంపారు. ఈ క్రమంలో కేటీఆర్ పై ఐపీసీ 504, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.


ఇదీ జరిగింది


కాగా, ఇటీవల హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గం సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్.. కాంట్రాక్టర్లు, బిల్డర్ల వద్ద రూ.2,500 కోట్లు వసూలు చేసి ఢిల్లీకి పంపించారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనకు సీఎంగా పని చేసేంత తెలివి లేదని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్, మోసాల పేరుతో మీడియాలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్ రెడ్డే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీతో పాటు సీఎం పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయని.. కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


Also Read: Telangana News: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి