Kadiyam Kavya Contesting from Warangal MP Seat: హైదరాబాద్: వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిత్వంపై సస్పెన్స్ తొలగిపోయింది. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన కడియం కావ్యను వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య ఆదివారం ( మార్చి 31న) కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎంపీ టికెట్ కేటాయించినా, ఆ పార్టీని వీడి హస్తం గూటికి చేరారు. అనుకున్నట్లుగానే కడియం కావ్య వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు. ఏఐసీసీ పెద్దలు, కేసీ వేణుగోపాల్, తెలంగాణ కాంగ్రెస్ కీలక నేతలతో చర్చించిన అనంతరం అధిష్టానం సోమవారం రాత్రి ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. 


కాంగ్రెస్ అధిష్టానం ఇదివరకే అభ్యర్థుల 9 జాబితాలు విడుదల చేయగా, తాజాగా సోమవారం (ఏప్రిల్ 1న) రాత్రి ఇద్దరు అభ్యర్థులతో 10వ జాబితా ప్రకటించారు. మహారాష్ట్రలో అకోలా నుంచి డాక్టర్ అభయ్ కాశీనాథ్ పాటిల్ ను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.


తెలంగాణలో మొత్తం 17 లోక్ సభ స్థానాలుండగా 13 సీట్లకు అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా వరంగల్ సీటుపై ప్రకటన రావడంతో 3 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. కీలకమైన హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మరోవైపు బీఆర్ఎస్, బీజేపీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారాన్ని మొదలుపెట్టాయి. కాంగ్రెస్ 100 రోజుల పాలనలో లోటుపాట్లు, అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోల హామీల అమలు, రైతు సమస్యలను బూచిగా చూపించి, తమ పార్టీలకు ఓట్లు అడుగుతున్నాయి బీఆర్ఎస్, బీజేపీ.


మాజీ సీఎం కేసీఆర్ ఇదివరకే జిల్లాల బాట పట్టారు. ఆదివారం మార్చి 31న జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిపోయిన పంటల్ని పరిశీలించి రైతులలో ధైర్యాన్ని నింపారు. దేశంలో మోదీ మేనియా ఉందని, ఈ సారి తెలంగాణలో 10, 12 సీట్లు నెగ్గుతామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాషాయ పార్టీ నేతలు ధీమాగా ఉన్నారు.