Communist parties of Telangana : తెలంగాణ రాజకీయాల్లో కమ్యూనిస్టు పార్టీల నేతలు పొత్తుల కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించం లేదు. బీఆర్ఎస్‌తో పొత్తు ఖాయం అని..కనీసం రెండు పార్టీలకు చెరో రెండు సీట్లు అయినా కేసీఆర్ కేటాయిస్తారని ఆశపడ్డారు. మునుగోడు ఉపఎన్నికల్లో తమ మద్దతుతోనే గట్టెక్కారన్న కృతజ్ఞత చూపిస్తారని అనుకున్నారు. కానీ కేసీఆర్ మాత్రం రాజకీయాల్లో అలాంటివేమీ వర్కవుట్ కావని జాబితా ప్రకటనతో స్పష్టం చేశారు. దీంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు చూశారు. ఆ పార్టీతో చర్చలు జరిపారు. కానీ ఆక్కడా సానుకూల స్పందన రాలేదని తెలుస్తోంది. దీంతో రెండు కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి.
పొత్తుల ఆశలు వదిలేసుకుంటున్న కామ్రేడ్స్
తెలంగాణ రాజకీయాల్లో కామ్రేడ్ ల పొత్తు రాజకీయం ఎటూ తేలడం లేదు. రాబోయే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటాయని పెద్దఎత్తున ప్రచారం జరుగుతున్నా అటువంటి పరిస్థితి కనిపించడం లేదు. గురువారం హైదరాబాద్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు సమావేశం అయ్యాయి. వచ్చే ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌తో పొత్తు అంశంపై చర్చించలేదని.. అంటున్నారు. అక్టోబర్ 1న మరోసారి తాము కలిసి పోటీ చేయబోయే స్థానాలపై చర్చిస్తామన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచన బీజేపీకి సహకరించేలా ఉందని .. బీజేపీ కోసమే ఎంఐఎం థర్డ్ ఫ్రంట్ ఆలోచన చేస్తున్నరని వామపక్షాలు విమర్శిస్తున్నాయి.
ఆసక్తి చూపని కాంగ్రెస్
కమ్యూనిస్టులతో పొత్తుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు. పొత్తుకు అభ్యంతరం లేదని చెప్పిన నేతల్లో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినా మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం వ్యతిరేకించారని అంటున్నారు. పొత్తు వల్ల గెలిచే సీట్లు వదులుకోవాల్సి వస్తుందని, పైగా ఓట్ల మార్పి డి జరగదని వాదిస్తున్నారు. నల్గొండ, భువనగిరి ఎంపీ సెగ్మెంట్ల పరి ధిలోని 9 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు మంచి ఓటు బ్యాంక్ ఉందని.. పొత్తులు పెట్టుకుంటే ప్రయోజనమేనని మరికొందరు వాదిస్తున్నారు. రానీ పొత్తు వల్ల కాంగ్రెస్ సీట్లు త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే పార్టీకి నష్టమని సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ పొ త్తు కుదిరితే మాత్రం దాన్ని పార్లమెంట్ ఎన్నికల వరకు కొనసాగించాల్సిన పరిస్థితి వస్తుందని అంటున్నారు. కమ్యూనిస్టు నేతలు.. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతోనూ సమావేశం అయ్యారు. కానీ ఎలాంటి ఫలితమూ రాలేదు.
కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోటీ చేయడానికి సన్నాహాలు !
కమ్యూనిస్టులకు బలం ఉన్న జిల్లాలు ఖమ్మం , నల్లగొండ. ఇటీవల చేరికలతో ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ హౌస్ ఫుల్ అయింది. బలమైన నేతలు వచ్చి చేరారు. దీంతో అక్కడ ఒక్క సీటు కూడా కేటాయించే పరిస్థితి లేదు. నల్లగొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ కు బలమైన నాయకత్వ ఉంది. ఆ జిల్లాలోనూ సీట్లు కేటాయించలేరు. ఈ కారణంగానే పొత్తులపై కాంగ్రెస్ వెనుకడుగు వేస్తున్నట్లుగా భావిస్తున్నారు.