Congress candidates will be finalized through surveys conducted by Sunil : తెలంగాణ కాంగ్రెస్ లో మొదటి జాబితాలు పది లేదా పదకొండు మంది అభ్యర్థులు ఉంటారు అనుకుంటే కేవలం నలుగురికి మాత్రమే చోటు దక్కింది. దీంతో అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుందా అన్న చర్చ ప్రారంభమయింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత అంతా సీఎం రేవంత్ రెడ్డికి ఇచ్చారని అనుకున్నారు. రేవంత్ రెడ్డి కూడా అలాగే అనుకున్నారు. మొదటి అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించారు. రెండో అభ్యర్థిగా ప్రకటించకపోయినా చేవెళ్లలో సభ పెట్టి పట్నం సునీతా మహేందర్ రెడ్డికి ఓటేయాలన్నట్లుగా ప్రచారం చేశారు. మొదటి జాబితాలో వంశీ చంద్ రెడ్డికి టిక్కెట్ ఖరారైనా .. పట్నం సునీత పేరు మాత్రం రాలేదు.
ఫిరాయింపుదారులకే టిక్కెట్లా ?
జహీరాబాద్ కు సురేశ్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బల్ రాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. మిగతా స్థానాలు పెండింగ్ లో పెట్టింది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ పంపిన సింగిల్ నేమ్స్ లో బీఆర్ఎస్ నుంచి ఇటీవలే పార్టీలో చేరిన నలుగురు పేర్లు ఉండటం, వారంతా వరుసగా ఉన్న సెగ్మెంట్లలో పోటీకి దించాలని పీఈసీ ఏకాభిప్రాయానికి రావడం ఈ సర్వేకు కారణమైనట్టు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి బొంతు రామ్మోహన్, చేవెళ్ల నుంచి సునీతా మహేందర్ రెడ్డి, మల్కాజ్ గిరి నుంచి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మెదక్ నుంచి నీలం మధును పోటీకి దించాలని నిర్ణయించింది. ఈ నలుగురు కూడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. దీనిపై పునరాలోచించాలని భావిస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం మిగతా 13 సెగ్మెంట్లలో ఫ్లాష్ సర్వే చేయించాలని నిర్ణయంచింది.
రంగంలోకి సునీల్ కనుగోలు
కాంగ్రెస్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ సునీల్ కనుగోలు నేతృత్వంలోని సర్వే టీం రంగంలోకి దిగింది. అభ్యర్థుల బలాబలాలను అంచనా వేసే పనిలో పడిందని తెలుస్తోంది. సర్వే ఆధారంగా టికెట్లను ఫైనల్ చేసే అవకాశం ఉంది. పార్టీలో చేరడానికి సంప్రదింపులు జరుపుతున్న వారి అంశాన్ని కూడా సర్వే టీములు ప్రస్తావించి ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నట్టు సమాచారం. నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్ నేత కాంగ్రెస్ లో చేరి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేయడానికి కాంగ్రెస్ తో టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనకు టికెట్ ఇస్తే ఎలా ఉంటుంది? గెలిచే అవకావం ఉందా..? అనే అంశంపైనా ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఇలా మరికొన్ని సెగ్మెంట్లలోనూ జాయిన్ చేసుకోబోయే లీడర్ల గురించి .. వారిని అభ్యర్థులుగా ఖరారు చేస్తే ఎలా ఉంటుంది..? అనే అంశాలపైనా ఫీడ్ బ్యాక్ తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు.
11న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ
హోల్డ్ లో పెట్టిన స్థానాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ ఈ నెల 11న మరో మారు భేటీ అయ్యే అవకాశం ఉంది. అప్పటిలోగా ఫ్లాష్ సర్వే పూర్తి చేయాలని సునీల్ కనుగోలు టీం కు సూచించినట్టు తెలుస్తోంది. ఫ్లాష్ సర్వే నివేదికపై సమావేశంలో చర్చించి అభ్యర్థులు తేల్చే అవకాశం ఉంది. కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చే అవకాశాలు కూడా ఉన్నట్లుగా చెబుతున్నారు.