Telangana Cabinet Expansion | తెలంగాణలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టి రెండేళ్లు కావస్తోంది. కానీ పూర్తి స్థాయి క్యాబినెట్ మాత్రం కొలువు తీరలేదు. అయితే, మంత్రివర్గ పూర్తి స్థాయి విస్తరణ దిశగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తోంది. డిసెంబర్ తొలి వారంలోనే మరో రెండు మంత్రి పదవులను భర్తీ చేయడంతో పాటు, ప్రస్తుత మంత్రుల్లో కొందరికి ఉద్వాసన పలికి, మరికొందరికి అమాత్యుల పట్టం కట్టవచ్చని హస్తం ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, అమాత్యులుగా ఎవరు 'ఇన్', ఎవరు 'ఔట్' అన్న ఉత్కంఠ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. మంత్రుల శాఖల్లోనూ మార్పు ఉంటుందన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో విస్తృతంగా సాగుతోంది.
అజారుద్ధీన్ చేరికతో మరో రెండు బెర్తులు ఖాళీ
జూబ్లీ హిల్స్ ఉపఎన్నిక సందర్భంలో కాంగ్రెస్ హైకమాండ్ మైనార్టీ కోటాలో మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. గత కొన్నాళ్లుగా మైనార్టీ వర్గానికి మంత్రి పదవి దక్కలేదన్న చర్చకు అజారుద్ధీన్ ద్వారా ఫుల్ స్టాప్ పెట్టింది. దీంతో ప్రస్తుతం తెలంగాణ మంత్రుల సంఖ్య 16కు చేరింది. చట్ట ప్రకారం 18 మంది మంత్రులుగా పదవీ స్వీకారం చేయాల్సి ఉంది. మరో రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. మిగిలి ఉన్న ఈ రెండు స్థానాలను భర్తీ చేయడం ద్వారా అన్ని వర్గాలను, ప్రాంతాలను సంతృప్తి పరచాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. సామాజిక న్యాయ సూత్రాన్ని అనుసరించి ఈ రెండు బెర్తులను ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ లేదా బీసీ వర్గాలలోని కీలకమైన ఉపవర్గాలకు కేటాయించే అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. అయితే, ఈ బెర్తులు దక్కించుకోవడానికి సీనియర్ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
పీసీసీ చీఫ్ బి. మహేష్ కుమార్ గౌడ్, ఆది శ్రీనివాస్, విజయశాంతి వంటి కీలక నేతల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక మహిళకు అవకాశం ఇవ్వాలనే అంశాన్ని కూడా అధిష్టానం పరిశీలిస్తోందని గాంధీ భవన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విస్తరణ కేవలం రాజకీయంగానే కాకుండా, రాష్ట్ర పరిపాలనను మరింత చురుకుగా మార్చడానికి అనుభవం ఉన్నవారిని ఎంచుకోవడంపై కూడా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
బెర్తుల భర్తీయేనా, శాఖల మార్పు ఉండనుందా?
మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న రెండు స్థానాల భర్తీయే కాకుండా, కొందరు మంత్రుల శాఖలను మార్చే అవకాశం ఉందన్న చర్చ ప్రస్తుతం హాట్ హాట్‌గా సాగుతోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రుల పని తీరుపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు హైకమాండ్ సమీక్ష చేసినట్లు సమాచారం. ఆశించిన స్థాయిలో పని తీరు కనపర్చని మంత్రులకు ఉద్వాసన పలుకుతారన్న చర్చ సాగుతోంది. మరో మూడేళ్ల పాటు పాలనను పరుగులెత్తించాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని, అందుకు అనుగుణంగా మంత్రులుగా సమర్థులైన వారికి అవకాశం ఇవ్వాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
శాఖల మార్పులు కూడా ఉంటాయన్నది హస్తం నేతల మాట. ఇప్పటికే విద్య, మున్సిపల్, హోం వంటి ముఖ్యమైన శాఖలు సీఎం చెంతనే ఉన్నాయి. ప్రస్తుత మంత్రివర్గంలో ఉన్న వారి శాఖలను మార్చే అవకాశం లేకపోలేదన్న చర్చ నడుస్తోంది. మంత్రి శ్రీధర్ బాబుకు హోం మంత్రిగా అవకాశం ఇవ్వవచ్చన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
ఎవరిపై వేటు? ఎవరికి అవకాశం?
అయితే, ప్రస్తుతం ఎవరికి అవకాశం ఇస్తారు, ఎవరికి క్యాబినెట్ నుంచి ఉద్వాసన చెబుతారన్న దానిపై పూర్తి స్పష్టత లేకున్నా, పార్టీలో మాత్రం కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖను తప్పించి, ఆమె స్థానంలో బీసీ మహిళ కోటాలో విజయశాంతికి అవకాశం కల్పిస్తారన్న ప్రచారం సాగుతోంది. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్‌ను మంత్రివర్గంలోకి తీసుకుంటారని తెలుస్తోంది. తద్వారా తన సన్నిహితుడికి అవకాశం కల్పించడమే కాకుండా, బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చినట్లుంటుందన్న చర్చ సాగుతోంది. ఇక సీఎంతో నేరుగా తలపడిన మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఉద్వాసన తప్పదన్న చర్చ కాంగ్రెస్ పార్టీలో సాగుతోంది. ఆయన స్థానంలో మరో బలమైన సామాజిక వర్గం నుంచి అవకాశం ఇస్తారని చెబుతున్నారు. మల్ రెడ్డి రంగారెడ్డికి అవకాశం ఉందన్న ప్రచారం ఉంది.
ఇక కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి ఆయన స్థానంలో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. గత కొంత కాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీపై అసంతృప్తి వెళ్లగక్కుతున్న విషయం తెలిసిందే. తనకు మంత్రి పదవి ఇస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని, మాట నిలబెట్టుకోలేదని విమర్శలు చేస్తున్నారు. ఈ టైంలో 'కుటుంబానికి ఒకే పదవి' అన్న పార్టీ లైన్ ప్రకారం కోమటి రెడ్డి వెంకటరెడ్డిని తొలగించి, ఆయన సోదరుడు రాజ్ గోపాల్ రెడ్డికి అవకాశం దక్కవచ్చని తెలుస్తోంది. తద్వారా ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామన్న పేరు వస్తుందన్న ఆలోచనలో హై కమాండ్ ఉన్నట్లు సమాచారం.
మంత్రి విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ ఈ డిసెంబర్ మొదటి వారం లేదా జనవరిలో పూర్తిస్థాయి కేబినెట్ కొలువుదీరే అవకాశం ఉంది. ఈ నిర్ణయాలు కాంగ్రెస్ ప్రభుత్వం భవిష్యత్తు రాజకీయ వ్యూహానికి, పరిపాలనా సామర్థ్యానికి ప్రతీకగా నిలవనున్నట్లు హస్తం నేతలు చెబుతున్నారు.