CM Revanth Tweet on TG Name Changing: తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్ TS నుంచి TGగా మార్చడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ (X) వేదికగా స్పందించారు. ఈ నిర్ణయాల వెనుక 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఉందని అన్నారు. 'ఒక జాతి అస్థిత్వానికి చిరునామా ఆ జాతి భాష, సాంస్కృతిక వారసత్వమే. ఆ వారసత్వాన్ని సమున్నతంగా నిలబెట్టాలన్న సదుద్దేశంతోనే ‘జయ జయహే తెలంగాణ' గీతాన్ని రాష్ట్ర అధికారిక గీతంగా.. సగటు తెలంగాణ ఆడబిడ్డ రూపురేఖలే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రతిరూపంగా… రాచరిక పోకడలు లేని చిహ్నమే రాష్ట్ర అధికారిక చిహ్నంగా… వాహన రిజిస్ట్రేషన్లలో TS బదులు ఉద్యమ నినాదం TG అక్షరాలు ఉండాలన్నది 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష. ఆ ఆకాంక్షలను నెరవేరుస్తూ రాష్ట్ర కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాం.' అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణ(Telangana) తల్లి విగ్రహం ఒక వ్యక్తిని ఊహించుకునేలా ఉందని అందుకే మార్చనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అలాగే రాష్ట్ర అధికార చిహ్నంలోనూ మార్పులు, చేర్పులు చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది. రాష్ట్ర గీతంగా అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను మంత్రిమండలి ఆదివారం ఆమోదించింది. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరుగ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించిన కేబినెట్.. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై సంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. మరో 2 గ్యారెంటీలకు ఆమోదం తెలిపిన మంత్రి వర్గం అసెంబ్లీ సమావేశాల్లో వాటిపై ప్రకటన చేయనుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయనుంది.
- తెలంగాణ తల్లి విగ్రహం రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు చేయాలని నిర్ణయం
- తెలంగాణ అధికార గీతంగా 'జయ జయహే తెలంగాణ'
- వాహనాల రిజిస్ట్రేషన్లలో టీఎస్ (TS).. టీజీగా (TG) మార్పు
- రాష్ట్రంలో కుల గణన జరపాలని నిర్ణయం
- తెలంగాణ హైకోర్టుకు 100 ఎకరాల కేటాయింపునకు నిర్ణయం
- అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆమోదం, కొడంగల్ ప్రాంత అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- 65 ఐటీఐ కళాశాలలను అడ్వాన్స్ టెక్నాలజీ కేంద్రాలుగా అప్ డేట్ చేసేందుకు ఆమోదం
- సత్ప్రవర్తన కలిగిన ఖైదీలకు క్షమాభిక్ష ఇచ్చి విడుదల చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయాలను మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ మొదలైందని వివరించారు.
Also Read: BRS News: 2 లక్షల మందితో నల్గొండలో సభకు బీఆర్ఎస్ ప్లాన్, నీటి వాటాలపై కౌంటర్ ఇవ్వనున్న కేసీఆర్