Revanth Reddy Reaction On Jubilee Hills Result:  జూబ్లీహిల్స్ విజయం మా బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  అన్నారు.  ఈ విజయం కాంగ్రెస్ పాలనపై ప్రజల నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని, తమ బాధ్యతలను పెంచిందని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల పాలనను నిశితంగా పరిశీలించి తీర్పు ఇచ్చారని, సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంతో ఓట్ల శాతం పెరిగిందని తెలిపారు. విజయానికి కారణమైన ప్రజలకు, పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు చెప్పిన రేవంత్, గెలుపు లేదా ఓటమికి పొంగిపోకుండా, ప్రజల తరఫున నిలబడి పోరాడటమే కాంగ్రెస్ కర్తవ్యమని  స్పష్టం చేశారు. 

Continues below advertisement

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 39 శాతం ఓట్లు వచ్చాయి. ఆరు నెలల తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అది 42 శాతానికి పెరిగింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 51 శాతం ఓట్లు ప్రజలు ఇచ్చారని, ఇది ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల ఆశీర్వాదమని చెప్పారు. హైదరాబాద్ నుంచే రాష్ట్ర ఆదాయంలో 65 శాతం వస్తోందని, ఈ నగరానికి ప్రాధాన్యత దృష్ట్యా మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. సమస్యల రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ఈ దిశగా పని చేస్తామని హామీ ఇచ్చారు.

 కేంద్రం నుంచి నిధులు రాకుండా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయం నిరాకరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. అనేక ప్రాజెక్టులకు అనుమతులు రాకుండా అడ్డుకుంటున్నారని, మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి కీలక పనులకు అడ్డంకులు సృష్టిస్తున్నారని విమర్శించారు. కిషన్ రెడ్డి ఎంపీ నియోజకవర్గంలోనే  బీజేపీ ఓట్లు 65 వేల నుంచి 17 వేలకు తగ్గాయని, ఆయన వ్యవహార శైలిని ప్రజలు గమనించారని చెప్పారు. జూబ్లీహిల్స్ ఫలితాన్ని భూకంపానికి ముందు వచ్చే ప్రకంపనగా చూడాలని, తీరు మారకపోతే బీజేపీకి భూకంపం వంటి ఫలితాలు వస్తాయని హెచ్చరించారు. రాజకీయాలు మాని, రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర మంత్రులు,   ఎంపీలు కలిసి సహకరించాలని, ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చే బాధ్యత వారిపై ఉందని సూచించారు.

Continues below advertisement

ప్రతిపక్ష నేత కేటీఆర్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు రేవంత్. అసూయ తగ్గించుకోవాలని, అధికారం పోయినా కేటీఆర్‌లో అహంకారం, అసూయ పోలేదని విమర్శించారు. పదవులు ఎవరికీ శాశ్వతం కావని, కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని సూచించారు. మనం ఇంకా చాలా ఏళ్లు రాజకీయాలు చేయాల్సి ఉందని, ఫేక్ న్యూస్ రాయించి, ఫేక్ సర్వేలు చేయించుకుని భ్రమలో బతకకూడదని హెచ్చరించారు. భారత రాష్ట్ర సమితి ఓడిపోతుందని, బీజేపీకి డిపాజిట్ రాదని ముందే చెప్పానని పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో మద్దతు ఇచ్చిన ఎంఐఎం కు ధన్యవాదాలు తెలిపారు. అసదుద్దీన్ ఒవైసీకి కాంగ్రెస్ కార్యకర్తల పక్షంగా ధన్యవాదాలు చెప్పి, పొత్తులు, మద్దతులు రాష్ట్ర పరిస్థితులను బట్టి మారుతాయని తెలిపారు.

బిహార్ ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడుతూ, ఇంకా సమీక్షించలేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లో లేరని, ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని, ఇప్పుడు స్పందించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. వచ్చే పదేళ్ల పాటు కాంగ్రెస్ పాలిస్తుందని, మార్పు చేసి చూపిస్తామని రేవంత్   ప్రకటించారు.