CM Revanth Nirmal: "ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమానం.. ఇది పోరాటాల గడ్డ. పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్‌ను అభివృద్ధి చేయడమే నా లక్ష్యం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిర్మల్‌లో జరిగిన  ప్రజా పాలన- ప్రగతి బాట బహిరంగ సభలో  ప్రసంగించారు.  జిల్లా అభివృద్ధి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో విద్యా రంగాన్ని బలోపేతం చేసేందుకు బాసర ఐఐటీ  లోనే యూనివర్సిటీని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి జూపల్లి కృష్ణారావును ఆదేశించారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించి, నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

Continues below advertisement

తుమ్మిడిహట్టి నిర్మాణం.. పారిశ్రామిక ప్రగతి 

ఆదిలాబాద్ రైతాంగం చిరకాల స్వప్నమైన తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బడ్జెట్ సమావేశాల లోపు ఈ ప్రాజెక్టుపై పూర్తి నివేదిక ఇవ్వాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆదేశిస్తూ.. ప్రతి చుక్క నీటిని ఒడిసిపట్టి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. కేవలం సాగునీటికే పరిమితం కాకుండా, ఒకప్పుడు ఎర్రబస్సు తిరగడమే కష్టమైన ఈ ప్రాంతంలో ఎయిర్ బస్ తిరిగేలా ఎయిర్‌పోర్టును నిర్మిస్తామని, దానికి అనుబంధంగా 10 వేల ఎకరాల్లో అతిపెద్ద పారిశ్రామిక వాడను ఏర్పాటు చేసి వేలాది మందికి ఉపాధి కల్పిస్తామని వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రధానిని ఎన్నిసార్లయినా కలుస్తానని, ఇందుకు బీజేపీ ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు.

Continues below advertisement

సంక్షేమ పథకాలే ఊపిరి

పేదల సంక్షేమమే తన ప్రభుత్వ ఎజెండా అని పేర్కొన్న ముఖ్యమంత్రి, ఇప్పటికే అమలు చేస్తున్న ఆరు గ్యారంటీల పురోగతిని వివరించారు. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలను ఆర్టీసీ బస్సులకు యజమానులను చేశామని, మహిళా సంఘాలను వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతామని భరోసా ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం, రూ. 500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలతో సామాన్యుడికి అండగా ఉంటున్నామని తెలిపారు. గత పాలకులు చేసిన అప్పులు రాష్ట్రానికి ఉరితాడుగా మారినా, ప్రజల సంక్షేమం కోసం వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. ఓడిపోయిన వారు చేసే విమర్శలను తాను పట్టించుకోనని, ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని మంచి చేయడానికే ఉపయోగిస్తానని అన్నారు.

మహనీయుల స్మరణ - మున్సిపల్ ఎన్నికల నగారా 

ప్రజలకు సేవ చేసిన మహనీయుల గుర్తుగా చనాక-కొరటా ప్రాజెక్టుకు  సి.రామచంద్రారెడ్డి పేరును, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి  పేరును పెడుతున్నట్లు సీఎం ప్రకటించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల గురించి ప్రస్తావించారు.  మంచి ప్రజాప్రతినిధుల్ని గెలిపించాలన్నారు.  గతంలో గెలిచాం, రేపు గెలుస్తాం, మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు మేలు చేసే వారినే రాబోయే ఎన్నికల్లో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలని, ఎన్నికలు ముగిశాక కేవలం అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని ప్రజాప్రతినిధులకు సూచించారు