CM Revanth on Palamuru Rangareddy project : తెలంగాణ శాసనసభలో కృష్ణా జలాల కేటాయింపులు, సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శనివారం సుదీర్ఘమై ప్రసంగం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పన నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను లెక్కలతో వివరించారు. ఈ సభకు ఉన్న పవిత్రతను గుర్తు చేస్తూ, ఇక్కడ మాటల గారడీలకు తావులేదని, ప్రతి మాట ప్రజల ఆశయాలకు ప్రతిరూపంగా ఉండాలని పేర్కొన్నారు. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రాకుండా పారిపోవడం చట్టసభలను అవమానించడమేనని ముఖ్యమంత్రి మండిపడ్డారు.
ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ వెనుక కుట్ర పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పునాదుల గురించి ప్రస్తావిస్తూ, 2009లోనే ఎంపీ విఠల్ రావు అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి లేఖ రాసి ఈ ప్రాజెక్టుకు అంకురార్పణ చేశారని గుర్తు చేశారు. అయితే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఏ విధంగానైతే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి అంచనాలు పెంచారో, అదే విధంగా పాలమూరు-రంగారెడ్డిని కూడా జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి రూ.32,800 కోట్ల ప్రాజెక్టును రూ.90 వేల కోట్లకు చేర్చారని విమర్శించారు. వలసల జిల్లా పాలమూరు బిడ్డగా కరువు కష్టాలు తెలిసిన వాడిని కాబట్టే, ఈ అక్రమాలపై గొంతు ఎత్తుతున్నానని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు ద్రోహం: నీటి కేటాయింపుల విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు 'మరణ శాసనం' రాసిందని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. బచావత్ ట్రిబ్యునల్ (KWDT-1) ప్రకారం ఉమ్మడి ఏపీకి దక్కిన 811 టీఎంసీలలో తెలంగాణకు 490 టీఎంసీల వాటా అడగాల్సింది పోయి, కేసీఆర్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకుని సంతకం పెట్టిందని సాక్ష్యాలను బయటపెట్టారు. 2015 జూన్ సమావేశంలో మొదలుకుని, 2016 , 2020లో జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాల్లో కూడా ఇదే 299 టీఎంసీల తాత్కాలిక వాటాను శాశ్వతం చేసేలా కేసీఆర్ అంగీకరించి వచ్చారని ధ్వజమెత్తారు.
అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలోనే 2005-2014 మధ్యకాలంలో కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బీసీ వంటి కీలక ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి పనులు ప్రారంభించామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ఈ ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సింది పోయి, రీ-డిజైనింగ్ పేరుతో కాలయాపన చేస్తూ అసంపూర్తిగా వదిలేసిందని విమర్శించారు. తెలంగాణకు సాగునీటి విషయంలో కేసీఆర్ చేసినంత అన్యాయం మరెవ్వరూ చేయలేదని ఆయన మండిపడ్డారు.
సవాల్ విసిరిన సీఎం సభ పెడితే బట్టలు ఊడదీస్తాం.. తోలు తీస్తాం అని గతంలో కేసీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తూ.. ఇప్పుడు సభ పెట్టాం, చర్చకు రమ్మంటే ఎందుకు పారిపోతున్నారని నిలదీశారు. మీరు చర్చలో పాల్గొని ఉంటే ఎవరి తోలు ఊడుతుందో, ఎవరి అబద్ధాలు బయటపడతాయో ప్రజలకే తెలిసేదని ఎద్దేవా చేశారు. తెలంగాణ 4 కోట్ల ప్రజల ప్రాతినిధ్యం వహించే ఈ సభలో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని, కృష్ణా , గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులను కాపాడి తీరుతామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.