CM Revanth With Harvard students: అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం కేంబ్రిడ్జ్-బోస్టన్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తన హార్వర్డ్ యూనివర్సిటీ కార్యక్రమాలను ఉత్సాహంగా ముగించారు. చివరి రోజున ఆయన హార్వర్డ్ బిజినెస్ స్కూల్, ఎంఐటీ , కొలంబియా యూనివర్సిటీలకు చెందిన భారతీయ విద్యార్థులు, పూర్వ విద్యార్థుల బృందాలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. నాయకత్వ లక్షణాలు, ఆర్థికాభివృద్ధి నమూనాలు, పర్యావరణ పరిరక్షణ , రైతు సంక్షేమం వంటి విభిన్న అంశాలపై విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సీఎం తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. ముఖ్యంగా మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పనపై తనకున్న ఆలోచనల్ని వారితో పంచుకున్నారు.
ప్రొఫెసర్‌ను కాదు.. నిరంతర విద్యార్థిని!
ఈ సమావేశంలో ఒక ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఒక విద్యార్థుల బృందం తమకు లీడర్‌షిప్ - విజన్ గురించి పాఠాలు చెప్పాలని సీఎంను కోరగా, ఆయన భిన్నంగా స్పందించారు. హార్వర్డ్‌లోని మేధావులైన ప్రొఫెసర్లు ఉండగా, నేను ఇక్కడ ప్రొఫెసర్‌గా పాఠాలు చెప్పాలనుకోవడం లేదు. నేను కేవలం మీతో చర్చించి, విషయాలను పంచుకుంటూ నేర్చుకోవడానికి ఇష్టపడతాను అని వ్యాఖ్యానించారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా, నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటానన్న ఆయన మాటలు అక్కడి విద్యార్థులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా యువత
భారతదేశ భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, ముఖ్యంగా తెలంగాణ , హైదరాబాద్ నగరాలు దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తన ప్రభుత్వ విజన్‌ను ఆయన వివరించారు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులంతా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని, రాష్ట్ర ప్రగతిని ప్రపంచానికి చాటిచెప్పే బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని పిలుపునిచ్చారు. దీనికి స్పందించిన అనేకమంది విద్యార్థులు, తాము నేర్చుకున్న విజ్ఞానంతో తెలంగాణ అభివృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
సర్టిఫికేట్ అందుకున్న తొలి సీఎం
హార్వర్డ్ కెన్నెడీ స్కూల్‌లో లీడర్‌షిప్ ఇన్ ది 21st సెంచరీ అనే ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను రేవంత్ రెడ్డి విజయవంతంగా పూర్తి చేశారు. మైనస్ 24 డిగ్రీల గడ్డకట్టే చలిలోనూ ఏడు రోజుల పాటు క్రమం తప్పకుండా తరగతులకు హాజరై, అసైన్‌మెంట్‌లు పూర్తి చేసిన ఆయన.. పదవిలో ఉండగానే హార్వర్డ్ నుంచి సర్టిఫికేట్ పొందిన దేశంలోనే తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. 20 దేశాల ప్రతినిధులతో కలిసి ఆయన చేసిన ఈ విద్యాభ్యాసం, తెలంగాణ పాలనలో అంతర్జాతీయ ప్రమాణాలను తీసుకురావడానికి ఎంతగానో దోహదపడుతుందని రేవంత్ నమ్ముతున్నారు.