Tummidihatti barrage: గండిపేట వద్ద గోదావరి ఫేజ్ 2&3 కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటనలు చేశారు. తుమ్మిడిహెట్టీ దగ్గర ప్రాణహిత చేవెళ్ల కట్టి ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల రైతులకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. అయితే అక్కడ నీళ్లు లేవని గతంలో కేసీఆర్ మేడిగడ్డకు బ్యారేజీ స్థలాన్ని మార్చారు. ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని .. అందు కోసం మహారాష్ట్ర సీఎంను కలుస్తానని ప్రకటించడం వ్యూహాత్మకమని భావిస్తు్న్నారు.
1908 లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి నిజాం ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలను వరదల నుంచి కాపాడిందని.. వందేళ్లకు పైగా ఈ నగరానికి తాగు నీరు అందుతున్నాయంటే ఆనాటి నిజాం సర్కార్ దూరదృష్టినే కారణమన్నారు. కోటికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎంతో కృషి చేశాయని.. 1965 లో మంజీరా నది నుంచి నగరానికి తాగు నీరు అందించింది ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
2002 లో కృష్ణా నదీ జలాలను మూడు దశల్లో నగరానికి తరలించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలదన్నారు. కాంగ్రెస్ తెచ్చిన గోదావరి జలాలను నెత్తి మీద చల్లుకుని తామే ఏదో చేసినట్టు కొందరు నమ్మించారని.. నెత్తిమీద నీళ్లు చల్లుకున్నంత మాత్రాన వాళ్ల పాపాలు తొలగిపోవన్నారు. మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాతే గోదావరి జలాల తరలింపునకు ముందడుగు పడిందని ...కాలుష్యమయమైన మూసీతో నల్లగొండ జిల్లా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు. విషతుల్యమైన మూసీని ప్రక్షాళన చేస్తానని నల్లగొండ జిల్లా ప్రజలకు ఆనాడే మాట ఇచ్చానన్నారు.
20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్ కు తరలించబోతున్నాం ..ఇందులో 16 టీఎంసీలను హైదరాబాద్ తాగునీటి కోసం వినియోగించబోతున్నాం ..చెరువులను నింపుకుంటూ 4 టీఎంసీలను మూసీకి తరలించి మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. శ్రీపాద ఎల్లంపల్లి నుంచే గోదావరి జలాలను హైదరాబాద్ తరలిస్తున్నామని.. ఆ సంగతి మరిచిపోయి కొందరు మల్లన్నసాగర్ అని మాట్లాడుతున్నారని విమర్శించారు. చేవెళ్లలో వైఎస్ ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాసుల కక్కుర్తితో తలను తొలగించింది మీరు కాదా అని ప్రశ్నించారు. చేవెళ్ల, తాండూరు, పరిగికి సాగునీరు అందకపోవడానికి కారణం మీరు కాదా అని మండిపడ్డారు.
పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు ఎందుకు మూసీ నది ప్రక్షాళన చేపట్టలేదో చెప్పాలన్నారు తెలంగాణ రైసింగ్-2047 విజన్ డాక్యుమెంట్ ను డిసెంబర్ 9 న తెలంగాణ సమాజానికి అంకితం ఇవ్వబోతున్నామని.. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మా ప్రభుత్వం తిప్పికొడుతుందని ప్రకటించారు.