Telangana News :   తెలంగాణ  ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రపంచలోనే అతిపెద్దదైన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కృతమైంది. శుక్రవారం అంబేడ్కర్ మనమడు, మాజీ లోక్‌సభ సభ్యులు ప్రకాష్ అంబేడ్కర్‌తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణలో బౌద్ధ గురువులు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం అంబేద్కర్ స్మృతి వనాన్ని సీఎం కేసీఆర్, ప్రకాష్‌ అంబేద్కర్ సందర్శించారు. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం న‌డిబొడ్డున హుస్సేన్ సాగ‌ర్ తీరాన 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన భార‌త రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్ విగ్ర‌హాంపై హెలికాప్ట‌ర్ ద్వారా గులాబీ పూల వ‌ర్షం కురిపించారు. ఈ సంద‌ర్భంగా ఆ పూల వ‌ర్షాన్ని సీఎం కేసీఆర్, ప్ర‌కాశ్ అంబేద్క‌ర్‌తో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు వీక్షించారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ జై భీమ్ అని నిన‌దించారు. అక్క‌డున్న ప్ర‌జాప్ర‌తినిధులంతా చ‌ప్పట్ల‌తో పూల వ‌ర్షాన్ని స్వాగ‌తించారు.                  


నెక్లెస్ రోడ్డులోని ఎన్టీఆర్‌ గార్డెన్స్‌ పరిసరాల్లో మొత్తం 11.6ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టు నిర్మితమైంది. మహా విగ్రహం కొలువుదీరిన ప్రాంగణం ఆరు ఎకరాల వరకు ఉంటుంది. అందులో విగ్రహ నిర్మాణ ప్రాంతం 1.5 ఎకరం కాగా, మిగతా స్థలంలో ఉద్యానవనం, రాక్‌ గార్డెన్‌, ఫౌంటెన్‌ వంటివి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనా రూ.146 కోట్లు. ఇప్పటి వరకు రూ.84కోట్లు వెచ్చించారు. మిగతా నిధులతో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. స్మారక భవనం మీద నేలవైన అంబేడ్కర్‌ విగ్రహం పాదాల చెంతకు వెళ్లడానికి ఇరువైపులా మెట్ల దారిని, ఒకే సారి 15 మంది వెళ్లగలిగే రెండు లిఫ్టులను ఏర్పాటు చేశారు. భారీ భూకంపాలు, తుఫాన్లను తట్టుకునేలా, వందల ఏళ్ల పాటు విగ్రహం చెక్కు చెదరకుండా పటిష్టమైన లోహాన్ని ఉపయోగించారు.                       



అయితే పూలవర్షం విగ్రహంపై పడకపోవడం నిరాశపరించింది.  ఈ అంశంపై సీఎం కేసీఆర్ కూడా  అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావించి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా హెలికాఫ్టర్ నుంచి విగ్రహంపై పూలవర్షం కురిపించాలని ప్లాన్ చేశారు. కానీ వాతావరణం సరిగా లేకపోవటం..గాలి దిశ మార్చుకోవటంతో హెలికాఫ్టర్ నుంచి వేసిన పూలు విగ్రహంపైన పడలేదు. అంబేడ్కర్ మనువడు ప్రకాశ్ అంబేడ్కర్ కూడా పూలు అటు వైపు పడుతున్నాయంటూ సైగ చేయటం విజువల్స్ లో కనిపించింది. రెండు మూడుసార్లు హెలికాఫ్టర్ లో ఉన్న వాళ్లు పూలు చల్లేందుకు ప్రయత్నించినా అవి విగ్రహం పైన పడకపోవటంతో సీఎం కేసీఆర్ పక్కనే ఉన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేశారు. నవ్వుతూనే జరగాల్సిన కార్యక్రమం చూద్దాం పదండి అంటూ ముందుకు తీసుకెళ్లిపోయారు.