CM KCR Tour in Khammam, Karimnagar, Mahabubabad, Warangal Districts: ఇటీవల కురిసిన వడగళ్ల వర్షం వల్ల పంటలు తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ నేడు పర్యటన చేయనున్నారు. నేడు ఉదయం 10 గంటలకు ఆయన పర్యటన ప్రారంభం కానుంది. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌, మహబూబాబాద్‌ జిల్లాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తారు. చేతికొచ్చిన పంటల్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న రైతులకు సీఎం భరోసా ఇవ్వనున్నారు.


కరీంనగర్‌ జిల్లాలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో నేడు సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. బాధిత రైతులను ఓదార్చనున్నారు. బుధవారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు తదితర అధికారులు సీఎం పర్యటించే గ్రామాలను ముందస్తుగానే పరిశీలించారు. రామడుగులోని గాయత్రీ పంప్‌హౌస్‌ వద్ద ఉన్న హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేయగా, అక్కడ కూడా పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడినట్లుగా అంచనా.


మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో నేడు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. వడగళ్ల వానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.


వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ నేడు (మార్చి 23) పరిశీలించనున్నారు. ఈ పర్యటన కోసం అడవిరంగాపురంలో హెలీప్యాడ్‌ సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి అన్ని ఏర్పాట్లు చేయించారు. 


ఖమ్మం జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన కోసం హెలీప్యాడ్‌ను సిద్ధం చేశారు. రామాపురంతో పాటు గార్లపాడు, గోవిందాపురం, లక్ష్మీపురం, రావినూతల, ముష్టికుంట్ల గ్రామాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో సీఎం సమీక్షించనున్నారు.


తెలంగాణలో వారం రోజులుగా వడగళ్ల వానలు కురిశాయి. ఈ అకాల వర్షం వల్ల వరి, మొక్క జొన్నతోపాటు భారీస్థాయిలో ఉద్యాన పంటలు కూడా దెబ్బతిన్నాయి. మామిడి పిందె చాలా వరకూ రాలిపోయి అధిక నష్టం వాటిల్లింది. లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. పంట నష్టానికి సంబంధించిన నివేదికను అధికారులు కేసీఆర్‌కు అందించారు. ఇందులో భాగంగానే నేడు నాలుగు జిల్లాల్లో పర్యటించనున్నారు.


సీఎం నేటి షెడ్యూల్ ఇదీ



  • ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి రోడ్డుమార్గంలో బేగంపేట ఎయిర్ పోర్టుకు

  • 10.15 గంటలకు హెలికాప్టర్‌ ఎక్కి ఖమ్మం జిల్లాకు

  • 11.15 నుంచి 11.45 గంటల వరకూ ఖమ్మం జిల్లా బొనకల్‌ మండలం రామాపురం గ్రామంలో పర్యటన

  • 12.10 నుంచి 12.40 వరకూ మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో పర్యటన

  • 12.55 గంటలకు వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామానికి

  • మధ్యాహ్నం 1.30 గంటలకు అడవిరంగాపురం గ్రామం నుంచి కరీంనగర్ జిల్లాకు

  • 1.55 గంటలకు కరీంనగర్‌ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపురం గ్రామంలో పర్యటన

  • 2.30 గంటలకు హెలిక్యాప్టర్‌లో లక్ష్మీపురం గ్రామం నుంచి హైదరాబాద్‌కు

  • 3.15 గంటలకు బేగంపేటకు.. రోడ్డు మార్గంలో 3.30గంటలకు ప్రగతి భవన్‌కు