Yadadri Thermal Power Plant: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సీఎం కేసీఆర ఈరోజు సందర్శించబోతున్నారు. ఈ క్రమంలోనే  11 గంటలకు ప్రగతి భవన్ నుంచి బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వీర్లపాలెం చేరుకుంటారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించనున్నారు. అనంతరం పనుల పురోగతిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి సాయంత్రం వరకు హైదరాబాద్ చేరుకుంటారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి సహా పలువురు మంత్రులు, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు సీఎం వెంట రానున్నట్లు తెలుస్తోంది. సీఎం ప్రత్యేక హెలికాప్టర్ లో రానుండటంతో జిల్లా అధికారులు హెలిపాడ్ సహా అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. 


2015లో శంకుస్ధాపన చేసిన సీఎం కేసీఆర్..


దేశంలో ప్రభుత్వ రంగంలో అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని సంకల్పించిన ప్రభుత్వం, ప్లాంటు నిర్మాణం కోసం జాతీయ రహదారులు, రైల్వే నీటి వసతులు సమృద్ధిగా ఉన్న వీర్లపాలెం గ్రామాన్ని ఎంపిక చేసిన విషయం అందరికీ తెలిసిందే. రూ. 29,992 కోట్ల నిర్మాణ అంచనా వ్యయంతో ఐదు ప్లాంట్ల ద్వారా 800 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేయాలని భావించింది. ఈ మేరకు 2015 ఆగస్టు 18వ తేదీన ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. రికార్టు సమయంలో 4,676 ఎకరాల భూమిని సేకరించి జెన్ కోకు అప్పగించారు. ప్లాంట్ నిర్మాణంలో ఇప్పటికే 60 శాతం పనులు పూర్తి అయ్యాయి. ఐధు ప్లాంట్లలో రెండు ప్లాంట్ల ద్వారా 2023 సెప్టెంబర్ నాటికి విద్యుదుత్పత్తిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. 


2023 డిసెంబర్ కల్లా వెలుగులు పంచాలని సూచన..


ఈ రెండు ప్లాంట్లకు సంబంధించిన టర్బయిన్లు, చిమ్నీల ఏర్పాటు పూర్తయింది. అదే ఏడాది డిసెంబర్ వరకు మరో ప్లాంటు, 2024లో నాలుగు, ఐదో ప్లాంట్ లో విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని జెన్ కో నిర్ణయించింది. నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొదటి రెండు ప్లాంట్లలో 61.5 శాతానికి పైగా పనులు పూర్తి అయ్యాయి. ఒకటీ రెండు ప్లాంట్లో ఇంకా ఎక్కువ శాతం జరిగాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మూడో థర్మల్ విద్యుత్ కేంద్రం ఇంది. దీని నిర్మాణాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇది పూర్తయితే రాష్ట్ర అవసరాలకు కరెంటు కొరత ఉండదని ప్రభుత్వం అంచనా. 2023 డిసెంబర్ నాటికల్లా రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈలోగా యాదాద్రి ప్లాంటులో విద్యుదుత్పత్తి ప్రారంభించి రాష్ట్రానికి వెలుగులు పంచాలని సీఎం జెన్ కోకు సూచించారు. 


అయితే రాష్ట్ర అవసరాలకు యాదాద్రి విద్యుత్ కేంద్రం కీలకమని, దీని నిర్మాణ పనులను రాత్రింబవళ్లు పదివేల మంది కార్మికులు శరవేగంగా చేస్తున్నట్లు జెన్ కో వార్గాలు తెలిపాయి. దీనికి ఇచ్చిన పర్యావరణ అనుమతిని సమీక్షించి తిరిగి నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన ఆదేశాలు నిర్మాణానికి ఆటంకం కావని ఆయన స్పష్టం చేశారు. అయితే సీఎం కేసీఆర్ పర్యటనతో పనులు మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.