ఇటీవల కురిసిన వడగళ్ల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు. హైదరాబాద్ నుంచి నేరుగా ఆయన ఖమ్మం జిల్లాలోని బోనకల్ మండలానికి మొదట వెళ్లారు. అక్కడ రావినూతల గ్రామానికి చేరుకొని వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. ముందుగా అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను హెలికాప్టర్‌ నుంచే పరిశీలించారు. ఆ తర్వాత రావినూతల పంట పొలాల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద దిగి పంట పొలాల వద్ద రైతులను, స్థానిక వ్యవసాయ అధికారులను కలుసుకున్నారు. పంట నష్టం గురించి అధికారులు, రైతులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని ఎకరాల్లో పంట వేశారు? ఎంత పెట్టుబడి పెట్టారనే వివరాలు అడగి తెలుసుకున్నారు. అనంతరం గార్లపాడు మార్గంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటను పరిశీలించారు.


కౌలు రైతులనూ ఆదుకుంటాం


అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో కౌలు రైతులు ఎక్కువగా ఉన్నారని అన్నారు. సొంత పొలాన్ని పండించుకొనే రైతులను ఆదుకోవడమే కాకుండా, కౌలు రైతులను కూడా తప్పకుండా ఆదుకుంటామని చెప్పారు. రైతులు నిరాశకు గురి కావొద్దని ధైర్యం చెప్పారు. 


పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పరిహారం అందిస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఈ నిధులను గంటలోనే విడుదల చేస్తామని తెలిపారు. గాలి వాన వల్ల మొత్తం 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేశామన్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంత చెప్పినా చెవుటోని ముందు శంఖం ఊదినట్లే ఉందని విమర్శించారు. దీంతో ఈసారి పంట నష్టంపై కేంద్రానికి ఎలాంటి నివేదిక పంపదల్చుకోవడం లేదని అన్నారు. ఒకవేళ తాము పంపినా కేంద్రం నుండి ఎలాంటి నిధులు రాబోవని అన్నారు. కేంద్రానికి చెప్పినా గోడకు చెప్పినా ఒక్కటేనని ఎద్దేవా చేశారు. దేశానికి నూతన వ్యవసాయ విధానం అవసరం ఉందని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  పువ్వాడ అజయ్ కుమార్, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, రైతుబంధు అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సబర్వాల్ తదితరులు ఉన్నారు. ఖమ్మం జిల్లాలో పర్యటన అనంతరం మహబూబాబాద్‌ జిల్లాకు సీఎం కేసీఆర్‌ వెళ్లనున్నారు.


ఈ జిల్లాల్లో కూడా
కరీంనగర్‌ జిల్లాలో రామడుగు, చొప్పదండి, గంగాధర మండలాల్లో నేడు సీఎం కేసీఆర్‌ పర్యటిస్తారు. బాధిత రైతులను ఓదార్చనున్నారు. బుధవారం కలెక్టర్‌ ఆర్వీ కర్ణన్‌, సీపీ సుబ్బారాయుడు తదితర అధికారులు సీఎం పర్యటించే గ్రామాలను ముందస్తుగానే పరిశీలించారు. రామడుగులోని గాయత్రీ పంప్‌హౌస్‌ వద్ద ఉన్న హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేయగా, అక్కడ కూడా పరిశీలించారు. కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 23,116 ఎకరాల్లో పంట నష్టం ఏర్పడినట్లుగా అంచనా.


మహబూబాబాద్‌ జిల్లాలోని పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో నేడు మధ్యాహ్నం సీఎం కేసీఆర్‌ పర్యటించనున్నారు. వడగళ్ల వానతో ఇక్కడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. నష్టపోయిన పంటలను పరిశీలించి రైతుల్లో మనోధైర్యం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ ఈ ప్రాంతంలో పర్యటించనున్నారు.


వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంతో పాటు పరిసర గ్రామాల్లో వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్‌ నేడు (మార్చి 23) పరిశీలించనున్నారు. ఈ పర్యటన కోసం అడవిరంగాపురంలో హెలీప్యాడ్‌ సిద్ధం చేశారు. స్థానిక ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి అన్ని ఏర్పాట్లు చేయించారు.