Chicken Rate in Hyderabad Today:  తెలుగు రాష్ట్రాల్లో నాన్‌వెజ్ ప్రియులకు చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. వేసవి తాపం ఒకవైపు, వేడుకల సీజన్ మరోవైపు వెరసి చికెన్ రేట్లకు రెక్కలొచ్చాయి. సామాన్యుడికి అందుబాటులో ఉండే మాంసాహారం కాస్తా ఇప్పుడు  ప్రీమియం ఐటమ్‌గా మారిపోయింది.  

గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు అనూహ్యంగా పెరిగాయి. కిలో చికెన్ ధర సాధారణంగా రూ. 200 నుండి రూ. 220 మధ్య ఉండాల్సింది పోయి, ప్రస్తుతం  రూ. 320 నుండి రూ. 380   వరకు  స్కిన్‌లెస్ పలుకుతోంది. కొన్ని చోట్ల నాటు కోడి ధరలు కిలోకు రూ. 800 వరకు చేరాయి.  ఈ అకస్మాత్తు పెరుగుదల మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది.

 ఎందుకు పెరుగుతున్నాయి?  

1.  ఎండల తీవ్రత : మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరుకోవడంతో కోళ్లు వేడిని తట్టుకోలేక మరణిస్తున్నాయి  . దీంతో పౌల్ట్రీ ఫారాల్లో దిగుబడి గణనీయంగా తగ్గింది.2.  ఫీడ్ ఖర్చులు: కోళ్లకు పెట్టే మేత  మొక్కజొన్న, సోయా  ధరలు పెరగడం వల్ల నిర్వహణ ఖర్చు భారమై, రైతులు కోళ్ల పెంపకాన్ని తగ్గించేశారు.3. పెళ్లిళ్ల సీజన్:  ప్రస్తుతం ముహూర్తాల సీజన్ కావడంతో ఫంక్షన్ హాల్స్, హోటళ్ల నుండి ఆర్డర్లు విపరీతంగా పెరిగాయి. డిమాండ్ ఎక్కువగా ఉండి, సప్లై తక్కువగా ఉండటంతో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.

 సరఫరా కొరత - డిమాండ్ పెరుగుదల 

తెలంగాణలో రోజుకు సగటున 11 లక్షల కిలోల చికెన్ వినియోగం ఉంటుంది. అయితే ప్రస్తుతం ఎండల వల్ల కోళ్లు బరువు తూగకపోవడం 1.5 కిలోలకే పరిమితమవడం  వల్ల మార్కెట్లోకి తక్కువ మాంసం వస్తోంది. హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆంధ్రప్రదేశ్ నుండి కూడా హైదరాబాద్ మార్కెట్‌కు కోళ్ల సరఫరా తగ్గడం ధరల పెరుగుదలకు మరో కారణం. గ్యాస్ సిలిండర్, నూనె ధరలు ఇప్పటికే భారంగా మారాయి. ఇప్పుడు చికెన్ కూడా కిలో రూ. 400 కి చేరువలో ఉండటంతో  ముక్క లేనిదే ముద్ద దిగని సామాన్యుడికి ఇది పెద్ద దెబ్బ  అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో నెల రోజుల వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.