Telangana News: గత ఆరునెలల నుంచి చంద్రబాబుకు అన్నీ కలిసి వస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల్లో BRS ఓటమి నుంచి తన సహచరుడు రేవంత్ రెడ్డి గెలుపు అలాగే ఏపీ ఎన్నికల్లో తన బద్ద శత్రువు జగన్ ఘోర ఓటమి నుంచి తెలుగుదేశం కూటమి తిరుగులేని విజయం వరకూ అన్నీ ఆయనకు కలిసి వచ్చాయి. ఏకంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వమే ప్రస్తుతం చంద్రబాబుపై ఆధారపడి ఉంది. అలాంటి తరుణంలో పోయిన చోటే వెతుక్కునేందుకు చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు.


పార్టీ ఉనికి సైతం కోల్పోయింది అనే స్థితి నుంచి తెలంగాణా లో మళ్ళీ బలపడేందుకు టీడీపీ రెడీ అవుతోంది. అందుకే చంద్రబాబు ప్రతీ వీకెండ్ హైదారాబాద్ లో ప్లాన్ చేసుకుంటున్నారు అన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. నిజానికి ఒకానొక దశలో ఆంధ్ర ప్రాంతం కంటే తెలంగాణ లోనే టీడీపీ బలంగా ఉండేది. తలసాని శ్రీనివాస యాదవ్, కడియం శ్రీహరి, సీతక్క, రేవంత్ రెడ్డి, నామా నాగేశ్వర రావు ఇలా కీలక నేతలు అంతా తెలంగాణ నుంచి టీడీపీలో ఉండేవారు. ఇంకా చెప్పాలంటే కేసీఆర్ సైతం ఆ పార్టీ నుంచి వచ్చిన వారే. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పార్టీ బాగా దెబ్బతింది. కేసీఆర్ పదేళ్ళ పాలనలో తెలంగాణ టీడీపీ ఉనికి సైతం ప్రమాదంలో పడింది. కానీ ఇప్పుడు పరిస్థితులు అనుకూలించడంతో చంద్రబాబు మళ్ళీ పావులు కదుపుతున్నారు.


టార్గెట్ ఆ పార్టీ యేనా?


తెలంగాణలో ప్రస్తుతం జాతీయ పార్టీల హవా ఎక్కువగా ఉంది. కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉంటే బీజేపీ రోజురోజుకీ బలపడుతోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి శ్రీనివాస్, రాజా సింగ్ లాంటి సీనియర్ నాయకులు పార్టీని క్షేత్ర స్థాయిలోకి బాగా తీసుకెళుతున్నారు. దానితో BRS నాయకులు బీజేపీ వైపు చూస్తున్నారని త్వరలోనే BRS పార్టీ బీజేపీ లో విలీనం అవుతుంది అంటూ కొన్ని మీడియా కథనాలు సైతం వచ్చాయి. అయితే వీటిని BRS తీవ్ర స్థాయిలో ఖండించింది. మరోవైపు బీజేపీ సైతం BRS కాంగ్రెస్ లో కలుస్తుంది అంటూ ఆరోపించింది. దీనినీ BRS తప్పు పట్టింది.


కానీ ఒక్క విషయం మాత్రం గ్యారెంటీ గా చెప్పొచ్చు.అదే జాతీయ పార్టీలు రెండూ BRS ను టార్గెట్ చేశాయి. స్థానికంగా బలంగా ఉన్న BRS ను దెబ్బ తీస్తేనే తమ పార్టీలకు భవిష్యత్ అనేదే వాటి అజెండా. ఇదే సమయంలో టీడీపీ రంగం లోకి దిగుతోంది. ప్రో డెవలప్ మెంట్ నేతగా చంద్రబాబు కు తెలంగాణలో ముఖ్యంగా హైదారాబాద్ లో బాగా పేరుంది. మొన్న చంద్రబాబు ను జైల్లో పెట్టినప్పుడు హైదారాబాద్ లో వెల్లువెత్తిన నిరసనలు ఇంకా చంద్రబాబు హవా ఉంది నాయకులకు తెలియజేసింది. దానితో BRS సహా మిగిలిన పార్టీల్లోని అసంతృప్తి నేతలకు టీడీపీ ఒక ఆప్షన్ లా కనపడుతోంది. ఒకవేళ కొన్ని మీడియా సంస్థలు అంచనా వేస్తున్నట్టు తెలంగాణ లో రాజకీయ పార్టీల  స్వరూపం రానున్న రోజుల్లో మారితే ఆయా పార్టీల్లోనీ అసంతృప్త లీడర్లకు టీడీపీ ఒక ఆప్షన్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. 


టార్గెట్ అధికారం కాదు


అయితే చంద్రబాబు ఇమ్మీడియత్ టార్గెట్ తెలంగాణలో టీడీపీ అధికారం కాదు. కానీ టీడీపీని జాతీయ పార్టీ అని చెప్పుకోవడమే తప్ప ఇతర రాష్ట్రాల్లో సీట్ల పరంగా ఎలాంటి ప్రభావం లేదు. టీడీపీ  జాతీయ పార్టీ అనే ట్యాగ్ రావాలంటే కనీసం కొన్ని సీట్లన్నా వేరే రాష్ట్రంలో ఉండాలి అనేది చంద్రబాబు ఆలోచన. దానికి తెలంగాణ మంచి అవకాశంగా కనపడుతోంది. రానున్న ఎన్నికల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎలక్షన్ లలో కనీసం ఆంధ్ర సెటిలర్స్ ఉన్న ప్రాంతాల్లో అయినా సొంతంగా గానీ లేదా ఏదన్నా వేరే పార్టీ పొత్తు తో గానీ ప్రభావం చూపాలని బాబు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఈమధ్య ఎక్కువగా హైదరాబాద్ లో తమ పార్టీ లీడర్ల తో కలుస్తున్నారు. వారికి పార్టీ బలోపేతంపై దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు. మరి ఆయన వ్యూహ రచన ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి అంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.