హైదరాబాద్: తెలంగాణలో జనగణన-2027 ప్రక్రియలో భాగంగా సెల్ఫ్-ఎన్యుమరేషన్ కార్యక్రమం నేడు (ఏప్రిల్ 26న) ప్రారంభం అవుతుంది. మొత్తం రెండు దశలలో జనగణన చేస్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి శనివారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. 

Continues below advertisement

రాష్ట్రంలో తొలి జనగణనతెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన కావడంతో పాటు, ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి గణన కావడం విశేషం.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా కులగణనను కూడా ఈ ప్రక్రియలో భాగంగా చేపడుతున్నారు. ప్రజలు నేరుగా జనగణన ప్రక్రియలో భాగస్వాములు అయ్యి వివరాలు సమర్పించేందుకు సెల్ఫ్-ఎన్యుమరేషన్ ఒక మంచి అవకాశమని భారతీ హాళికెరి పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా కేంద్రం చేపడుతున్న జనగణన ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేయవచ్చు.

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్ని లెక్కిస్తామని భారతీ హాళికెరి తెలిపారు. దేశ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ కొన్ని రోజుల కిందట మొదలైందని, షెడ్యూల్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో తొలి విడతలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. నివాసం ఉండే ప్రతి చోటా గణన జరుగుతుందన్న ఆమె... తరువాత మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి మార్కింగ్ చేస్తారని తెలిపారు. జనగణన రెండో దశలో భాగంగా ఫిబ్రవరి 2027 నుండి వ్యక్తుల వ్యక్తిగత సమాచార సేకరణ ప్రారంభించనున్నారు. ఈలోపు మొదటి దశ సెల్ఫ్ ఎన్యూమరేషన్ తో పాటు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేడానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆమె వివరించారు.

Continues below advertisement