IPS Naveen Kumar Arrested: ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంటి కబ్జాకు యత్నించిన కేసులో ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ (Naveen Kumar) ను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న నవీన్ కుమార్, రిటైర్డ్ ఐఏఎస్ భన్వర్ లాల్ (Banwar Lal) ఇంట్లో అద్దెకు ఉన్నారు. అయితే, ఆ ఇంటిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారంటూ భన్వర్ లాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గతంలో నవీన్ కుమార్ కు 41ఏ నోటీసులిచ్చి విచారించిన పోలీసులు అరెస్ట్ చేసి విడుదల చేశారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి నవీన్ కుమార్ అన్న, వదినలను అరెస్ట్ చేసిన సీసీఎస్ పోలీసులు.. తాజాగా నవీన్ కుమార్ ను సైతం అదుపులోకి తీసుకున్నారు.


ఇదీ జరిగింది


2014లో జూబ్లీహిల్స్ లోని తమ నివాసాన్ని సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కు 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేశామని భన్వర్ లాల్ సతీమణి మణిలాల్ చెప్పారు. 2019లో రెంటల్ అగ్రిమెంట్ పూర్తి కాగా, ఇళ్లు ఖాళీ చేయమంటే చేయమన్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో వీరికి సమీప బంధువైన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్.. సాంబశివరావు దంపతుల వద్ద అగ్రిమెంట్ ను తీసుకున్నారు. అప్పటి నుంచీ ఆ ఇంట్లోనే  అద్దెకు ఉంటున్న నవీన్ కుమార్.. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి సంతకాన్ని ఫోర్జరీ చేశారని తమ ఇంటిని కబ్జా చేయాలని చూస్తున్నారని  భన్వర్ లాల్ ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాంబశివరావు, డింపుల్ దంపతుల పేర్లను కూడా ఈ కేసులో చేర్చారు. వారిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఏ2గా ఉన్న నవీన్ కుమార్ ను తాజాగా అరెస్ట్ చేశారు. అయితే, తాను ఏ తప్పూ చేయలేదని.. 2020 నుంచీ ఈ వివాదం కొనసాగుతోందని ఐపీఎస్ నవీన్ కుమార్ గతంలో చెప్పారు. సివిల్ వివాదంపై పోలీసులు కేసు నమోదు చేశారని వివరించారు.


Also Read: Sankranti: దారులన్నీ సొంతూరి వైపే - హైదరాబాద్, విజయవాడ హైవేపై వాహనాల రద్దీ