CBI Ex Director Nageswararao: తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి వ‌స్తే ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు చేస్తామ‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం చేవెళ్లలో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో ప్ర‌క‌టించారు. దీనిపై ఎంఐఎం అధినేత అస‌దుద్దీన్ ఒవైసీ ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు.  వెనుకబడిన ముస్లింలను చేరదీయాలన్న‌ ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్ష‌కు వ్య‌తిరేకంగా అమిత్ షా వ్యాఖ్య‌లు ఉన్నాయ‌ని మండిప‌డ్డారు. అయితే ఈ రెండు పార్టీలు ప్ర‌జ‌ల్లో మ‌తప‌ర‌మైన భావోద్వేగాలు రెచ్చ‌గొట్టి ల‌బ్ధి పొందాల‌ని చూస్తున్నాయ‌ని సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఎం.నాగేశ్వ‌ర‌రావు ఆరోపించారు. అలాంటి హామీల ప‌ట్ల తెలంగాణ ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు. 


హిందువులు అప్రమత్తంగా ఉండాలి


సీబీఐ మాజీ డైరెక్ట‌ర్ ఎం.నాగేశ్వ‌ర‌రావు తెలంగాణ‌లోని హిందువుల‌ను అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని హెచ్చ‌రించారు. బీజేపీ, మ‌జ్లిస్ పార్టీల మ‌త‌త‌త్వ ప్ర‌చారాన్ని న‌మ్మి మోస‌పోవ‌ద్ద‌ని సూచించారు. ఆ రెండు పార్టీలూ ప్ర‌జ‌ల్లో మ‌త సంబంధ‌మైన భావోద్వేగాలు ర‌గిల్చి త‌మ ప‌బ్బం గ‌డుపుకుంటాయ‌ని ఆయ‌న ఆరోపించారు. కేంద్రంతో పాటు తాము అధికారంలో ఉన్న‌ రాష్ట్రాల్లో హిందువుల‌ను మోస‌గించిన‌ట్టే తెలంగాణ‌లోని హిందువుల‌ను బీజేపీ మోసం చేయాల‌ని భావిస్తోంద‌ని ట్వీట్ చేశారు.






గ‌డిచిన 9 ఏళ్ల‌లో కాంగ్రెస్ స‌హా మిగిలిన అన్ని పార్టీలు సిగ్గుప‌డేలా మైనార్టీల సంక్షేమం కోసం బీజేపీ ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలు చూడాలంటూ నాగేశ్వ‌ర‌రావు వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. హిందువుల కోసం బ‌డ్జెట్‌లో ఒక్క రూపాయి కానీ, ప్ర‌త్యేకంగా ఒక ప‌థ‌కం కానీ ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని ఇదే బీజేపీ నిజ‌మైన హిందూ ప్రేమ అంటూ ఆయ‌న పేర్కొన్నారు. ముస్లింల‌ను ఉద్ద‌రించేది తాము మాత్ర‌మేన‌ని ఎంఐఎం.. హిందువుల‌ను, మైనార్టీల‌ను అభివృద్ధి చేసేది తామేనంటూ ఆర్ఎస్ఎస్‌- బీజేపీ చెప్పుకోవ‌డ‌మే కానీ చేసిందేమీ లేద‌ని నాగేశ్వ‌ర‌రావు కామెంట్ చేశారు.


ముస్లిం రిజ‌ర్వేష‌న్లు ర‌ద్దు: అమిత్ షా


వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ సంపూర్ణ మెజారిటీతో విజ‌యం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్య‌క్తంచేశారు. చేవెళ్లలో ఆదివారం జరిగిన‌ బహిరంగ సభలో ముస్లిం రిజర్వేషన్లపై అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని ఢిల్లీలో ప్రధాని మోదీకి వినిపించేలా నినదించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 9 ఏళ్లుగా బీఆర్ఎస్ అవినీతి పాలన చేస్తోందని అమిత్ షా ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రధాని కావడానికి కుర్చీ ఖాళీగా లేదని, నరేంద్ర మోదీ ప్రధానిగా హ్యాట్రిక్ కొడతారంటూ సెటైర్లు వేశారు.


అమిత్ షా పై అసదుద్దీన్ ఒవైసీ ఆగ్ర‌హం


తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని అమిత్ షా ఇచ్చిన హామీపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తంచేశారు. వెనుకబడిన ముస్లింలను చేరదీయాలని ప్రధాన‌మంత్రి నరేంద్ర మోదీ చెబుతుంటే.. అమిత్ షా వారి రిజర్వేషన్లను తొలగిస్తామని హామీ ఇస్తున్నారని మండిప‌డ్డారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన సమాజమైన ముస్లింలను చేరదీయాలి అని మోదీ చెప్పారని, వారి రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని ఒవైసీ ట్వీట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు న్యాయం చేయడంపై అమిత్ షా సిద్ధంగా ఉంటే 50 శాతం కోటా పరిమితిని తొలగించేందుకు రాజ్యాంగ సవరణ తీసుకురావాలని ఒవైసీ సూచించారు. “దయచేసి సుధీర్ కమిషన్ నివేదిక చదవండి. మీరు చేయలేకపోతే, దయచేసి ఎవరినైనా అడగండి. సుప్రీంకోర్టు స్టే కింద ముస్లింలకు రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి’ అని ఒవైసీ పేర్కొన్నారు.