Delhi Liquor Scam case: ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ఇందులో నిందితురాలిగా పరిగణించింది. ఈ మేరకు కవితకు సీబీఐ నోటీసులు కూడా ఇచ్చింది. ఈ కేసులో ఫిబ్రవరి 26న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు కవితను కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో ఇప్పటికే కల్వకుంట్ల కవితను సీబీఐ మూడుసార్లు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. 2022లో ఇదే కేసులో సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ కేసులో నిందితురాలిగా సెక్షన్ 41ఏ కింద నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులను సవరిస్తూ తాజాగా మరోసారి సీబీఐ నోటీసులు ఇచ్చింది. అప్పుడు చేసిన దర్యాప్తు తర్వాత కవితను నిందితురాలిగా సీబీఐ పరిగణించింది.
లిక్కర్ కేసులో సీబీఐ హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఆమెను విచారణ చేసి.. ఆమె స్టేట్మెంట్ తీసుకున్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కూడా కొన్నిసార్లు కవితను ఢిల్లీలోని తమ కార్యాలయానికి ఆహ్వానించి ప్రశ్నించింది. ఆఖరుసారి గత ఏడాది జనవరి 16న విచారణకు రావాల్సిందిగా కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే ఈడీ విచారణకు పిలవడాన్ని సవాలు చేస్తూ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉన్నందున కవిత తాను విచారణకు హాజరుకాలేనని ఈడీ అధికారులకు లేఖ రాశారు. ఆ తర్వాత ఈడీ నుంచి కవితకు ఎలాంటి సమాధానం రాలేదు. సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై మళ్లీ ఈ నెల 28న విచారణ జరగనుంది.