Caste census of BCs: దతియ (మధ్య ప్రదేశ్): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (KCR) చేసిన ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కేసీఆర్ స్పూర్తితో ఓబీసీ హక్కుల సాధన ఉద్యమం సాగాలని.. ఆయనలాగ పట్టదలతో, కార్యదీక్షతో చేసే ప్రతి ఉద్యమం ఫలితాన్ని ఇస్తుందని పేర్కొననారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ని ఆదర్శంగా తీసుకొని ఓబీసీ హక్కుల కోసం మధ్య ప్రదేశ్ లో పోరాటాన్ని మొదలుపెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలన్నారు. బీసీ కులగణన చేపట్టాలని, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు కోటా కల్పించాలని BRS MLC Kavitha డిమాండ్ చేశారు. మహిళా రిజర్వేషన్ చట్టం పోస్ట్ డేటెడ్ చెక్కు వంటిదని విమర్శించారు. కేంద్రంలో ఓబీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
పీడిత్ అధికార్ యాత్ర..
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లా కేంద్రం నుంచి ఓబీసీ హక్కుల ఫ్రంట్ వ్యవస్థాపకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టిన “పీడిత్ అధికార్ యాత్ర” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దతియలో ఓబీసీ ఫ్రంట్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. యాత్రను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మొదటిసారి రావడం సంతోషంగా ఉందన్నారు. ఆ రాష్ట్రానికి చెందిన ఝాన్సీ రాణి, అవంతిబాయి వంటి పోరాటయోధులు ప్రతి ఒక్కరికి స్పూర్తిదాయకం అన్నారు. ఇదే రాష్ట్రానికి చెందిన ఓబీసీ మహిళా ఉమా భారతి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, జాతీయ స్థాయిలో కీలక నాయకురాలిగా ఎదిగారని కవిత ప్రస్తావించారు.
కేసీఆర్ చేసిన కార్యక్రమాలు ఎవరూ చేయలేదు
తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో కేసీఆర్ ఎప్పుడూ ధైర్యం కోల్పోలేదని, ఎన్ని ఒడిదిడుకులు ఎదురైనా లక్ష్య సాధన కోసం పనిచేసి తెలంగాణ సాధించారని గుర్తుచేశారు. మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగించి ఉద్యమాన్ని నడిపించారని స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు సీఎంగా ఉండి అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారని, ముఖ్యంగా రైతుల కోసం కేసీఆర్ చేసినన్ని కార్యక్రమాలు ఎవరూ చేయలేదన్నారు. ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లు కట్టే పరిస్థితి లేకుండా చేయడంతో పాటు... రైతులకు పెట్టబడిసాయం, పండిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చారని కవిత వెల్లడించారు. తెలంగాణను సీఎం కేసీఆర్ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి దాదాపు 30 లక్షల మంది ఉద్యోగాలు కలిగేలా చేశారని గుర్తు చేశారు. కానీ ఝాన్సీ రైల్వే స్టేషన్ ను చూస్తే మధ్య ప్రదేశ్ నుంచి వలసలు ఏ విధంగా ఉన్నాయో అర్థమవుతుందని, పెద్ద పరిశ్రమలు లేని కారణంగా చదువుకున్న పిల్లలు కూడా దూర ప్రాంతాలకు వెళ్లి పనిచేసుకోవాల్సిన పరిస్థితి ఉందని, ఇటువంటి పరిస్థితులు మధ్య ప్రదేశ్ లో మారాలని ఆకాంక్షించారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓబీసీ హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఓబీసీలు ఐక్యంగా లేరు కాబట్టి ప్రభుత్వాలు ఆ డిమాండ్ ను పెడచెవిన పెడుతున్నాయని, కాబట్టి ఓబీసీలకు ఐక్యం చేయడానికి దామోదర్ యాదవ్ ముందడుగు వేశారని ప్రశంసించారు. ఓబీసీలకు, మహిళలకు, ఇతర అణగారిన వర్గాలకు రాజకీయ, విద్యా, ఉద్యోగ రంగాల్లో తగిన వాటా లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో ఓబీసీ న్యాయమూర్తులు ఎంత మంది ఉన్నారని రాహుల్ గాంధీ అడుగుతున్నారు. ఎవరి తప్పు అది ? దశాబ్దాలపాటు అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఓబీసీ న్యాయమూర్తుల సంఖ్యను ఎందుకు ఎక్కువ చేయలేకపోయింది ? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఓబీసీలకు ఎందుకు మద్ధతివ్వలేదు ? ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాల్లో ఓబీసీల సంఖ్య ఎందుకు తక్కువగా ఉందో ప్రజలు ఆలోచించాలన్నారు.
ఉద్యమిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారన్న విశ్వాసం ఉందని స్పష్టం చేశారు. ఇది దామోదర్ సింగ్ యాదవ్ ఉద్యమం కాదని, ఇది ప్రజల కోసం, వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేస్తున్న ఉద్యమమని కవిత అన్నారు. దామోదర్ యాదవ్ ఉద్యమం ఆరంభం మాత్రమేనని, దేశవ్యాప్తంగా అది విస్తరిస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. యువకులు, మహిళలకు ప్రధాన స్రవంతిలోకి వచ్చి ఉద్యమాల్లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.