Police Cases On Revant reddy : రేవంత్ రెడ్డి పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పలు జిల్లాల్లో పోలీసు అధికారుల సంఘాలు ఆయనపై ఫిర్యాదులు చేస్తున్నాయి. దీంతో పలు చోట్ల కేసులు నమోదు చేస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో పోలీసు అధికారుల సంక్షేమ సంఘం నేతలు కూడా పోలీసులకు పిర్యాదు చేయడంతో కేసులు నమోదు చేశారు. రేవంత్ రెడ్డి తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు.
మహబూబ్‌నగర్‌లో రేవంత్ పోలీసులపై ఆరోపణలు
ఇటీవల మహబూబ్ నగర్‌లో పర్యటించిన రేవంత్ రెడ్డి పోలీసులపై విమర్శలు చేశారు. " మహబూబ్‌నగర్ పోలీసులకు నేను చెప్పదలుచుకున్నా.. రెడ్ డైరీలో మీ పేర్లు రాసి పెడతం. 100 రోజుల తరువాత మా ప్రభుత్వం వచ్చినాక ఒక్కొకన్ని గుడ్డలిప్పదీస్తం. అసలు, మిత్తీతోని చెల్లిస్తం’ అని హెచ్చరించారు. రజారక్షణకు చిత్తశుద్ధితో పనిచేస్తున్న పోలీసులపై కాంగ్రెస్ నేత చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలపై పోలీలీసు అధికారుల సంఘాలు విమర్శలు చేస్తున్నాయి. పోలీసుల మనోభావాలు దెబ్బతీసిన రేవంత్‌రెడ్డి.. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. క్షమాపణలు చెప్పకపోవడంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతలు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్‌పై కేసులు నమోదయ్యాయి.
పోలీసులను బెదిరించడం సరి కాదన్న పోలీస్ అసోసియేషన్లు
బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై గోపిరెడ్డి ఖండించారు. ‘తదుపరి ప్రభుత్వం మాదేనని, మీ సంగతి చూస్తామని’ బెదిరించడం ఎక్కడి రాజనీతి?. ‘రెడ్ డైరీ’ అంటే ఏమిటి? అదేమన్నా మీ సొంత రాజ్యాంగమా? అని రేవంత్‌ను ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ ప్రభుత్వంలో అంతర్భాగమని, ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు శాంతి భద్రతలను కాపాడతామని స్పష్టంచేశారు. చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తున్న పోలీసులను మీరు ఎర్ర డైరీలో ఎకిస్తే, ప్రజలు మిమ్మల్ని నల్ల డైరీల్లో ఎకిస్తారన్నారు. మీరు పోలీసు వ్యవస్థకు ఎన్నడూ మేలు చేయకపోగా, పోలీసుల ఆత్మగౌరవం దెబ్బదీసే విధంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వెం టనే రేవంత్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, పోలీసు వ్యవస్థకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.
పలు జిల్లాల్లో రేవంత్‌పై పోలీసు సంఘాల ఫిర్యాదులు
పోలీసుల మనోభావాలను దెబ్బతీసిన రేవంత్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. రేవంత్ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్టు రాచకొండ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు సీహెచ్ భద్రారెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీ కృష్ణారెడ్డి తెలిపారు. నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు గుణవర్ధన్ ఫిర్యాదు మేరకు పీసీసీ చీఫ్ రేవంత్, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి, కాంగ్రెస్ నేత సంపత్‌కుమార్‌పై నాగర్‌కర్నూల్ పోలీసులు కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు వెంకటయ్య ఫిర్యాదుతో మహబూబ్‌నగర్, జడ్చర్ల, భూత్పూర్‌లో కేసులు నమోదయ్యాయి.
పోలీసు సంఘాల తీరుపై కాంగ్రెస్ నేతల అసహనం
బీఆర్ఎస్ తో కలిసి పోలీసులు పని చేస్తున్నారన్నదానికి వారు టీ పీసీసీ అధ్యక్షునిపై పెడుతున్న కేసులే సాక్ష్యమని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ రెడ్డి అందరు పోలీసుల్ని అనలేదని.. బీఆర్ఎస్‌తో కలిసి కాంగ్రెస్ నేతలపై కుట్రలు చేస్తున్న వారిని మత్రమే అంటున్నామని చెబుతున్నారు. మొత్తంగా పోలీసులు వర్సెస్ రేవంత్ అన్నట్లుగా తెలంగాణ రాజకీయం మారిపోయింది.