Telangana municipal elections Campaign Close: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రచార పర్వం ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలు , కార్పొరేషన్లలో గెలుపు జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు శక్తివంచన లేకుండా శ్రమించాయి. సోమవారం సాయంత్రంతో మైకులు మూతపడటంతో, అభ్యర్థులు ఇప్పుడు అంతర్గత సమావేశాలు, ఇంటింటి ప్రచారంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగియడంతో 48 గంటల పాటు సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. రాజకీయ పార్టీలు ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించడంపై ఎన్నికల సంఘం నిషేధం విధించింది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనుండగా, ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడనున్నాయి. ప్రచారం ముగియడంతో అభ్యర్థులు ఇప్పుడు తెరవెనుక వ్యూహాలకు పదును పెడుతున్నారు.రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే పోలింగ్ కోసం సర్వం సిద్ధం చేసింది.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 116 మున్సిపాలిటీలు , 7 నగరపాలక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. వీటి పరిధిలో ఉన్న 2,996 వార్డుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఓటర్లు సిద్ధమయ్యారు. మొత్తం 12,993 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవగా, వారి భవితవ్యాన్ని తేల్చేందుకు రాష్ట్రవ్యాప్తంగా 8,203 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. సుమారు 52 లక్షల 43 వేల మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఎన్నికల నిర్వహణ కోసం భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సుమారు పాతిక వేల మంది పోలీసులతో భారీ బందోబస్తును ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా తప్పదని ఈసీ హెచ్చరించింది. సోషల్ మీడియా, మొబైల్ ప్రచారాలపై కూడా ఆంక్షలు విధించారు. శాంతియుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ఓటర్లు పెద్ద ఎత్తున తరలివచ్చి ఓటు వేయాలని కోరారు.
ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ,బీజేపీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. అధికార కాంగ్రెస్ తన పట్టును నిరూపించుకోవాలని చూస్తుంటే, ప్రతిపక్ష పార్టీలు తమ ఉనికిని కాపాడుకోవాలని శ్రమిస్తున్నాయి. పట్టణ ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
