Telangana Roads: గుడెబల్లూర్ నుంచి మహబూబ్‌నగర్ వరకు 4 లేన్లుగా NH 167 - ఆ ప్రాంతానికి మహర్ధశ
NH 167 from Gudebellur to Mahabubnagar | హైదరాబాద్- పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని నేషనల్ హైవే-167 విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

న్యూఢిల్లీ: హైదరాబాద్- పనాజీ (Goa) ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడెబల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు ఉన్న నేషనల్ హైవే-167ను 4 లేన్లుగా విస్తరించడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM)లో భాగంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ మొత్తం పొడవు 80.01 కిలోమీటర్లు అని, మొత్తం వ్యయం రూ. 3,175.08 కోట్లు అవుతుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ప్రస్తుతం, NH-167లో కర్ణాటకలోని గుడెబల్లూర్ నుంచి తెలంగాణలోని మహబూబ్‌నగర్ మధ్య ఉన్న రహదారి చాలా అధ్వాన్నంగా ఉంది. దాంతో గుడెబల్లూర్, మగ్నూర్, మక్తల్, మరికల్, దేవరకద్ర, జక్లేర్, యెలిగండ్ల, బండర్‌పల్లి వంటి పట్టణాలకు ప్రయాణించడం వల్ల ట్రాఫిక్ రద్దీ ఏర్పడి జర్నీ టైం బాగా పెరుగుతోంది. ఈ సవాళ్లను అధిగమించడానికి, ఈ ప్రాజెక్టును 4 లేన్లుగా నేషనల్ హైవే- 167ను అభివృద్ధి చేయడానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్‌నగర్ జిల్లాలకు భారీ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది సరుకు రవాణా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుంది.
గుడెబల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు విస్తరణ ప్రాజెక్ట్ పూర్తయితే రెండు ప్రధాన జాతీయ రహదారులు NH-150, NH-167N అనుసంధానం అవుతాయి. తద్వారా తెలంగాణలోని కీలక ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్ కేంద్రాలకు నిరంతర కనెక్టివిటీ పెరుగుతోంది. ఈ అప్‌గ్రేడ్ చేసిన కారిడార్ 3 PM గతిశక్తి ఎకనామిక్ నోడ్స్, 9 సోషల్ నోడ్స్, 7 లాజిస్టిక్ నోడ్స్‌ను కలుపుతూ వెళ్లడం ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది. దాంతో ఈ ప్రాంతంలో ప్రయాణీకుల రాకపోకలతో పాటు సరుకు రవాణా సైతం వేగవంతం అవుతుందని కేంద్రం భావిస్తోంది.
హైదరాబాద్- పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా గూడెబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు జాతీయ రహదారి-167 ను విస్తరించాలనే నిర్ణయం, ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడంతో పాటు ఉపాధి అవకాశాలను సృష్టించి, ప్రజల జీవన సౌలభ్యాన్ని మరింత మెరుగుపరుస్తుంది.https://t.co/vITIcxvT6e
— Narendra Modi (@narendramodi) February 14, 2026
NH-167 విస్తరణ పనులు పూర్తయిన తర్వాత, ఇది ప్రాంతీయ ఆర్థిక వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధాన ఆర్థిక కేంద్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేస్తుంది. వాణిజ్య, పారిశ్రామిక అభివృద్ధికి కొత్త మార్గాలను తెరుస్తుంది. 80.01 కిలోమీటర్ల పొడవున్న ఈ యాక్సెస్ కంట్రోల్డ్ 4 లేన్ రోడ్డు ప్రాజెక్ట్ సుమారు 14.4 లక్షల పని దినాల ఉపాధిని, 17.9 లక్షల పని దినాల పరోక్ష ఉపాధిని అందిస్తుంది.
విస్తరణ పనులకు ఎన్‌హెచ్‌ఏఐ (NHAI) గతేడాది అక్టోబరులోనే టెండర్లు ఆహ్వానించినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రెండేళ్లలో 4 లేన్ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని కాంట్రాక్టర్ సంస్థకు ఎన్‌హెచ్‌ఏఐ గడువు విధించింది. ప్రస్తుతానికి మహబూబ్‌నగర్ - గుడెబల్లూర్ మధ్య రాకపోకలకు 3 గంటల సమయం పడుతుండగా, రోడ్డు విస్తరణ పనులు పూర్తయితే సగానికి జర్నీ టైం తగ్గుతుంది. చేరుకోవచ్చు.
హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ (HAM) అంటే ఏమిటి?
ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో (PPP) కొనసాగే ప్రాజెక్ట్. ఇందులో ప్రభుత్వం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం వాటాను నిర్మాణ సమయంలో చెల్లిస్తుంది. మిగిలిన 60 శాతాన్ని కాంట్రాక్టర్ సమకూర్చుకోవాలి. దీనివల్ల కాంట్రాక్టర్లపై ఆర్థిక భారం తగ్గి ప్రాజెక్టులు వేగంగా పూర్తవుతాయి. ప్రభుత్వానికి సైతం పూర్తి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. టోల్ వసూలు, నిర్వహణ లేదా రోడ్డు యాజమాన్యంలో ప్రైవేట్ సంస్థకు బాధ్యత ఉండదు. ఈ లేన్ రహదారి విస్తరణతో కర్ణాటకలోని రాయచూర్ నుండి హైదరాబాద్‌కు ప్రయాణించే వారికి జర్నీ తగ్గుతుంది. ముఖ్యంగా మక్తల్, మరికల్ వంటి ప్రాంతాల ప్రజలకు ఇది వరం లాంటిది.
























