BRS should apologise to Telangana asks CM Revanth: నల్లగొండ వేదికగా బుధవారం జరిగిన  విజయభేరి బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ , ఆయన కుటుంబంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయానికి బీఆర్ఎస్ క్షమాపణ చెప్పాల్సింది పోయి, సిగ్గు లేకుండా మాట్లాడుతోందని మండిపడ్డారు. కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే అది తెలంగాణకు నోటీసులు ఇచ్చినట్లుగా చిత్రీకరించడాన్ని రేవంత్ తప్పుబట్టారు.  కేసీఆర్‌కు నోటీసులు ఇస్తే తెలంగాణకు ఇచ్చినట్లా..అలా అయితే ఎర్రవెల్లి, జన్వాడ, మొయినాబాద్‌లలో ఉన్న మీ ఫామ్‌హౌస్‌లు, మీ టీవీ ఛానళ్లు, పేపర్లను ముందుగా ప్రజలకు అప్పగించండి అంటూ ముఖ్యమంత్రి సవాల్ విసిరారు.                                  

Continues below advertisement

తెలంగాణ జాతిపిత అంశంపై కేసీఆర్ కుటుంబం చేస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్‌ను జాతిపితగా పిలుచుకుంటామని, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని  తెలంగాణ తల్లి గా గౌరవించుకుంటామని స్పష్టం చేశారు. అసలు ఏ ప్రాతిపదికన మిమ్మల్ని మీరు జాతిపితగా పిలుచుకుంటున్నారు అని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్‌లకు పాల్పడి, భార్యాభర్తల మధ్య జరిగే ప్రైవేట్ సంభాషణలను కూడా విన్న మీకు జాతిపిత అని పిలిపించుకునే నైతిక హక్కు లేదని, ఈ పనులకు మీరు సిగ్గుపడాలని ఘాటుగా విమర్శించారు.                                

రాజకీయాల్లో ఎవరూ చట్టానికి అతీతులు కారని, కేటీఆర్ ,  హరీష్ రావులపై జరుగుతున్న విచారణల గురించి రేవంత్ ప్రస్తావించారు. పోలీసులు ఎవరినైనా విచారణకు పిలిచినప్పుడు సామాన్యులకు ఎలాంటి కఠిన నిబంధనలు వర్తిస్తాయో, వీరికి కూడా అవే వర్తించాలని అధికారులకు సూచించారు. అవసరమైతే నిందితుల ముఖాలకు ముసుగులు వేసి తీసుకువెళ్లే ప్రోటోకాల్‌ను కూడా అమలు చేయాలని కానీ పోలీసులు మంచోళ్లన్నారు. చట్టం  తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఎవరూ కూడా తాము ప్రత్యేకం అని భావించకూడదని హితవు పలికారు.         

Continues below advertisement

నల్లగొండ జిల్లా అభివృద్ధిపై తమ  ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, గత పాలకులు పెండింగ్‌లో పెట్టిన ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ అహంకారం వల్లే బీఆర్ఎస్ పతనమైందని, ఇప్పటికైనా ప్రజల పక్షాన నిలబడటం నేర్చుకోవాలని సూచించారు. రానున్న ఎన్నికల్లో కూటమి విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.