Harish Meets KCR in Farm House:  తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇప్పుడు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ఈ క్రమంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు ఆయన ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి పార్టీ అధినేత కేసీఆర్‌తో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. కేటీఆర్‌కు ఇచ్చిన నోటీసుల్లో పేర్కొన్న సెక్షన్లు, అవి తీవ్రమైనవేనని..  బీఆర్ఎస్ న్యాయవాద వర్గాలు చెబుతున్నాయి. అయితే   కేటీఆర్ విచారణకు హాజరవుతారని ఆ పార్టీ న్యాయవ్యవహారాలు చూసే సోమా భరత్ ప్రకటించారు. 

Continues below advertisement

హరీష్ తీవ్ర ఆరోపణలు 

గురువారం మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, ఇతర హామీలను అమలు చేయడం చేతకాకనే రేవంత్ రెడ్డి  డైవర్షన్ పాలిటిక్స్  చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు. సింగరేణిలో జరుగుతున్న బొగ్గు కుంభకోణాలను, ప్రభుత్వ వైఫల్యాలను మేము ప్రశ్నిస్తున్నందుకే నిన్న నాకు, నేడు కేటీఆర్ గారికి సిట్ నోటీసులు పంపారు. నువ్వు ఎన్ని నోటీసులు పంపినా, ఎన్ని కేసులు పెట్టినా.. చివరి హామీ నెరవేరే వరకు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు  అని ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల ఖాతాల నుంచి డబ్బులు లాక్కునే సైబర్ నేరగాడిలా వ్యవహరిస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Continues below advertisement

 మెదక్ అభివృద్ధిని ఆగం చేస్తున్న కాంగ్రెస్ 

దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా కలపై ఊరించి మోసం చేస్తే, కేసీఆర్  మెదక్ ను జిల్లాగా చేసి మెడికల్ కాలేజీ, రైలు మార్గం, కలెక్టరేట్ వంటివి తెచ్చారని హరీష్ రావు గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలో పదేళ్ల పాటు నీళ్లతో కళకళలాడిన ఘనపురం ప్రాజెక్టు, నేడు కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ఎండిపోయి క్రాప్ హాలిడే ప్రకటించే దుస్థితికి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ లో కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మన జిల్లాను మనమే రద్దు చేసుకోవడం, మన కంటిని మనమే పొడుచుకున్నట్టు అని ఆయన ప్రజలను హెచ్చరించారు.

మహాలక్ష్మి ఇచ్చేదాకా వెంటాడుతాం                  

రాష్ట్రవ్యాప్తంగా మంత్రులను మహిళలు, రైతులు నిలదీస్తున్నారని, ఆ భయంతోనే ప్రభుత్వం విపక్ష నేతలపై కక్ష సాధింపునకు దిగుతోందని హరీష్ రావు పేర్కొన్నారు.  మహాలక్ష్మి పథకం కింద ఇవ్వాల్సిన రూ. 62,500 బాకీ, రైతు రుణమాఫీ, అవ్వతాతలకు పెన్షన్ బకాయిలు ఇచ్చేదాకా రేవంత్ రెడ్డిని వెంటాడుతూనే ఉంటాం. ఈ నోటీసులు మాకేం కొత్త కాదు, తెలంగాణ ఉద్యమ కాలం నుంచే ఇలాంటివి చాలా చూశాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుగా ఓడించి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పాలి అని పిలుపునిచ్చారు. ఈ విచారణల పేరుతో చేసే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తాము భయపడేది లేదని స్పష్టం చేశారు.