BRS on Vice President Election: హైదరాబాద్: ఉప రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని BRS పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ వేధింపులు కారణమని ఆరోపించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలను BRS పార్టీ బహిష్కరించింది. తాము ఎన్నికల్లో ఎవరికీ మద్దతు తెలపడం లేదని, ఈ ఎన్నికలకు దూరంగా ఉండన్నట్లు బీఆర్ఎస్ అధికారికంగా ప్రకటించింది. బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్, రాజ్యసభ సభ్యుడు కె. సురేష్ రెడ్డి ఈ నిర్ణయాన్ని మీడియాకు తెలిపారు.

Continues below advertisement

తెలంగాణ ప్రభుత్వ వేధింపులతో బీఆర్ఎస్ కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమపై వేధింపులకు పాల్పడుతుందని, రాజకీయంగా తమను ఒత్తిడికి గురిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో పాల్గొనడం సరైనది కాదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిపారు. సామాజిక న్యాయం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వ చర్యలు అడ్డంకిగా మారుతున్నాయని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య పరంగా సరైన వాతావరణం లేకపోవడంతో ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ రెడ్డి వెల్లడించారు. ఈ నిర్ణయాన్ని పార్టీ శ్రేణులు సమర్థించాయని తెలిపారు. బీఆర్ఎస్ నిర్ణయంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణంపై చర్చలు జరుగుతున్నాయి. 

Continues below advertisement

ఎన్డీయేకు మద్దతు అవసరం లేదు

అలాగే, NDAకు BRS మద్దతు అవసరం లేదని పార్టీ భావిస్తోంది. ఆ కారణంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నుంచి దూరంగా ఉండాలని బీఆర్ఎస్ నిర్ణయం తీసుకున్నట్లు సురేష్ రెడ్డి తెలిపారు. కవిత లిక్కర్ స్కామ్ వ్యవహారంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని రోజులు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేకనే లిక్కర్ కేసులో కవితను ఇరికించారని అరెస్ట్ చేసిన సమయంలో కేటీఆర్, హరీష్ రావు అన్నారు.

 

బీఆర్ఎస్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్ చేశాయని..

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన అభివృద్ధిని అవినీతిగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో కొత్త రాష్ట్రం అయినప్పటికీ తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే నెంబర్ వన్‌గా చేసి చూపించిన కేసీఆర్‌ పాలనపై అవినీతి ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయని గులాబీ శ్రేణులు అంటున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నివేదికలు ఇచ్చింది కానీ, పోలవరం ప్రాజెక్టు దెబ్బతిన్న సమయంలో ఎందుకు పరిశీలించలేదని కేటీఆర్, హరీష్ రావు పలుమార్లు ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ దర్యాప్తు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. తాజా రాజకీయ పరిణామాలతో విసిగిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరం జరిగింది.

గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. కానీ రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీకి నలుగురు సభ్యులు ఉన్నారు. బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం కారణంగా రాజ్యసభ సభ్యులు సైతం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయరు. అనారోగ్య కారణాలతో ఇటీవల జగదీప్ ధన్‌ఖడ్ ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉంది. ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ కు అవకాశం ఇవ్వగా.. ఇండియా కూటమి అభ్యర్థిగా తెలుగు వ్యక్తి, మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డి బరిలో నిలిచారు.