Telangana EX Minister Harish Rao: దుబ్బాక: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో  దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి మాజీ మంత్రి హరీష్ రావు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాకలో బీఆర్ఎస్ గెలుపు కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు శిరసు వంచి నమస్కరించారు. దుబ్బాక కార్యకర్తల కృతజ్ఞత సభలో హరీష్ రావు మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డామని చెప్పారు. కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో దుబ్బాక ప్రజలు ప్రభాకరన్నను 50 వేల మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని సాధించారని హర్షం వ్యక్తం చేశారు. 
మనం విడిపోతే వాళ్లు బాగుపడుతారు
దుబ్బాక అంటే గులాబీ పార్టీ అడ్డా అని, ఇది తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ధర్నాలు, పోరాటాలు, నిరసనలకు దుబ్బాక కేంద్రం. దుబ్బాక బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని.. పార్లమెంటు ఎన్నికల్లోనూ దుబ్బాక కార్యకర్తలు రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. కొత్త ప్రభాకర్‌ మంచి వ్యక్తి అని, ఆయనకు అందరూ అండగా నిలబడాల్నారు. మనలో మనకు విభేదాలు వద్దు. మనం విడిపోతే వాళ్లు బాగుపడుతారని బీఆర్ఎస్ శ్రేణులను అలర్ట్ చేశారు.  పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలను కడుపులో పెట్టి కాపాడుకుంటాం, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. 


అసెంబ్లీ ఎన్నికలు స్పీడ్ బ్రేకర్!
‘ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు పార్టీకి స్పీడ్ బ్రేకర్ వంటివి. కారు నెమ్మదిగా వెళ్లి మళ్లీ వేగం అందుకుంటుంది. నిత్యం ప్రజల్లో ఉంటూ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాలి.  మనం ముళ్లబాటలూ చూశాం, పూలబాటలూ చూశాం. మన ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడాను ప్రజలు గుర్తిస్తున్నారు. బీఆర్ఎస్ (టీఆర్ఎస్) కొట్లాడకపోతే తెలంగాణ వచ్చేదా?  కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలు. మన ఏడు మండలాలను, సీలేర్ ప్రాజెక్టులను ఆంధ్రాకు కట్టబెట్టిన ఆ పార్టీలకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవు. కేంద్రంలో అధికారం కోసం బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ, వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకుండా దగా చేసింది. కాంగ్రెస్ ది కూడా అదే వైఖరి’ అన్నారు హరీష్ రావు. 


కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను నెర్చవేర్చడం లేదన్నారు. రైతుబంధు పదిహేను వేలు ఇస్తామని చెప్పి మాట తప్పిందన్నారు. డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామన్న హమీని కూడా నిలెబ్టుకోలేదని హరీష్ రావు ప్రస్తావించారు. ఆసరా పింఛన్ల 4 వేలు ఇస్తామని రెండు వేలు ఇచ్చారని, ఉచిత కరెంటు ఇస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు ముక్కుపిండి బిల్లు వసూలు చేస్తోందంటూ సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే పింఛన్లు పెంచామని గుర్తుచేశారు. కరోనా కాలంలో ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు ఆపి మరీ రైతుబంధు పథకాన్ని నిధులిచ్చి అన్నదాతలను ఆదుకున్నాం. గెలిచిన తెల్లారే పదివేలు ఇచ్చామని పేర్కొన్నారు. 


మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల్లో 13 పెద్ద హామీలు ఉండగా.. మొత్తం 412 హమీలు ఇచ్చారు. వాటిని నెరవేర్చాలని మనం డిమాండ్ చేద్దాం. పార్లమెంటు ఎన్నికలు వచ్చేలోగా రుణమాఫీ చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే నైతిక అర్హత లేదు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పోరాడదాం. అంతిమ విజయం మనదేనని మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.