హైదరాబాద్ లో గ్రూప్ - 2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఆమె ఆత్మహత్య బాధాకరమని, ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదని అన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ విమర్శలపై కవిత తీవ్రంగా స్పందించారు.  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన బూటకమని, కాంగ్రెస్ పార్టీ ఆందోళన నాటకం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి చేసిన విమర్శలను కవిత తిప్పికొట్టారు.


'బతుకమ్మ చేస్తాం.. బాధనూ పంచుకుంటాం'


ఈ సందర్భంగా బతుకమ్మ సంబరాలపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కవిత తీవ్రంగా ఖండించారు. 'మేము బతుకమ్మ చేస్తాం.. బాధను కూడా పంచుకుంటాం.' అని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యమని ధ్వజమెత్తారు.


రాజకీయమే వారి విధానమా.?


ఓ ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడమే కాంగ్రెస్ విధానమా.? అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నది కాంగ్రెస్ పార్టీ కాదా.? అని ఆమె నిలదీశారు. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్  పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా.? అని పేర్కొన్నారు. గ్రూప్ - 2 వాయిదా వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేశారని, రేవంత్ రెడ్డి సైతం ట్విట్టర్ (X) వేదికగా డిమాండ్ కోరారని గుర్తు చేశారు.


'రేవంత్' ఆవేదన బూటకం'


ప్రవళిక ఆత్మహత్యపై రేవంత్ రెడ్డి ఆవేదన బూటకమని, కాంగ్రెస్ ఆందోళన నాటకమని ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలి హత్య చేసిన వారే ఓదారుస్తున్నట్లుందని ధ్వజమెత్తారు.


రేవంత్ రెడ్డి ఏమన్నారంటే.?


అంతకు ముందు ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, 'బతుకమ్మ సంబరాలపై వీడియోలు పెట్టే MLC కవితకు, గ్రూప్ - 2 పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక ఆత్మ ఘోష వినపడడం లేదా.?' అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకు, రాజకీయ నినాదాలు తప్ప మానవీయ ఎజెండాలు కాదు' అని ట్వీట్ లో ధ్వజమెత్తారు. 


వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన మర్రి ప్రవళిక (23) అశోక్ నగర్ లోని ఓ హాస్టల్ లో ఉంటూ గ్రూప్ - 2కు సన్నద్ధమవుతోంది. శుక్రవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, గ్రూప్ - 2 పరీక్ష వాయిదాతోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ఆరోపిస్తూ వందలాది మంది నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై రాజకీయంగానూ వివాదం రేగుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ కాంగ్రెస్, బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.