BRS MLC Kavitha Released from Tihar Jail | న్యూఢిల్లీ: తనను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేశారని, ఇది రాజకీయ ప్రేరేపిత కేసు అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలోని తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం భర్త అనిల్ ను ఆళింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఆలింగనం చేసుకోగా, కవిత వెన్ను తట్టారు. 165 రోజుల తరువాత కవిత జైలు నుంచి విడుదల కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.





తిహార్ జైలు వద్దే కవిత మీడియాతో మాట్లాడుతూ.. నేను మంచిదాన్ని, అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. ప్రజాక్షేత్రంలో ఇంకా గట్టిగా, కమిట్మెంట్ తో పనిచేస్తాం. చట్ట ప్రకారం మేం పోరాడతాం. నేను కేసీఆర్ కూతుర్ని, తప్పు చేసే ప్రసక్తే లేదు.  బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ ను కొందరు టార్గెట్ చేశారు. 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. ఒక తల్లిగా అయిదు నెలలు కుటుంబాన్ని వదిలి ఉంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అన్ని గుర్తు పెట్టుకుంటాను. వీటికి తప్పకుండా వడ్డీ తో సహా చెల్లిస్తాను. అండగా నిలబడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు. జై తెలంగాణ అంటూ’ నినాదాలు చేశారు. 


 



ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గేదేలే
తాము ఏ తప్పు చేయలేదని, ఈ విషయం తగ్గేదే లేదు. కానీ మమ్మల్ని టార్గెట్ చేశారు. ఉద్దేశపూర్వకంగా జైలుకు పంపించారు. తెలంగాణ బిడ్డను. కేసీఆర్ కూతురు తప్పు చేయదు అన్నారు కవిత. మీడియా ముందు గట్టిగా మాట్లాడినా.. కుమారుడ్ని చూడగానే కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. తల్లి కవిత కన్నీళ్లను ఆమె కుమారుడు తుడిచాడు. అక్కడి నుంచి ఢిల్లీలోని పార్టీ కార్యాయానికి కేటీఆర్, హరీష్ రావు, భర్త అనిల్ తో కలిసి కవిత, బీఆర్ఎస్ శ్రేణులు వెళ్లిపోయాయి. మొన్నటి బెయిల్ పిటిషన్ వరకు కేటీఆర్, హరీష్ రావు కవిత కోసం గట్టిగానే ప్రయత్నించారు. ఈసారి ఎలాగైనా కవితను బెయిల్ మీద బయటకు తీసుకురావాలని బీఆర్ఎస్ బలగం ఢిల్లీలో పాగా వేసింది. అనుకున్నది సాధించింది. కవితకు బెయిల్ రావడంతో ఆమె భర్త అనిత్, కేటీఆర్ సహా కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేశారు.