BRS MLC Kavitha First Tweet After Long Gap: ఢిల్లీ లిక్కర్ కేసులో (Delhi Liquor Case) అరెస్టై దాదాపు 165 రోజుల తర్వాత బెయిల్‌పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) తొలిసారిగా ట్వీట్ చేశారు. సత్యమే గెలిచిందని 'సత్యమేవ జయతే' అంటూ పోస్ట్ పెట్టారు. దీనికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి తన నివాసానికి చేరుకున్న అనంతరం భర్త అనిల్, సోదరుడు కేటీఆర్‌తో కలిసి అభివాదం చేసిన ఫోటోను జత చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. కవిత చివరిసారిగా మార్చి 14న ట్వీట్ చేశారు. యాదాద్రి ఆలయం ఫోటో పేపర్ క్లిప్ షేర్ చేస్తూ.. 'దేవుడు శాసించాడు.. కేసీఆర్ నిర్మించాడు' అని ట్వీట్ చేశారు.
కవితకు ఘనస్వాగతం
జైలు నుంచి విడుదలైన అనంతరం ఎమ్మెల్సీ కవిత.. తన భర్త అనిల్, కుమారుడు, సోదరుడు కేటీఆర్ (KTR), ఇతర నేతలతో కలిసి ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి బుధవారం సాయంత్రం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడ జై తెలంగాణ నినాదాలతో వారు హోరెత్తించారు. అధిక సంఖ్యలో కార్లతో ర్యాలీ తీశారు. అక్కడి నుంచి బంజారాహిల్స్‌లోని తన నివాసానికి భర్త, సోదరుడు కేటీఆర్, కుమారుడు, ఇతర నేతలతో కలిసి వెళ్లారు. అప్పటికే అక్కడికి చేరుకున్న తల్లిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఆమెకు ఆత్మీయంగా ముద్దు పెట్టారు. ఈ క్రమంలో కవిత 10 రోజులు విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ రోజుల్లో ఆమె ఎవరినీ కలవరని సమాచారం.
కేసీఆర్‌ను కలవనున్న కవిత
జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత గురువారం తన తండ్రి, మాజీ సీఎం కేసీఆర్‌ను కలవనున్నారు. బుధవారం హైదరాబాద్ చేరుకున్న ఆమెకు కేసీఆర్ ఫోన్ చేసి మాట్లాడారు. గురువారం తన ఇంటికి భోజనానికి ఆహ్వానించారు. దీంతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్‌కు కవిత వెళ్లనున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను మార్చి 15వ తేదీన అరెస్ట్ చేసింది. అనంతరం పలుమార్లు బెయిల్ కోసం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించగా ఊరట దక్కలేదు. ఎట్టకేలకు ఈడీ, సీబీఐ కేసుల్లో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసిందని.. ఈడీ దర్యాప్తు కూడా పూర్తి చేసిందని.. కవిత జైలులో ఉండాల్సిన అవసరం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందని.. అందుకే బెయిల్ మంజూరు చేస్తున్నట్లు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మంగళవారం బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు ఉత్తర్వుల ఆర్డర్ అందిన తర్వాత, పుచీకత్తు సమర్పించిన అనంతరం ఆమె అదే రోజు రాత్రి 9 గంటలకు విడుదలయ్యారు.
Also Read: Kavitha Bail: కవిత బెయిల్ పై బీజేపీ, కాంగ్రెస్ ల పొలిటికల్ వార్ వెనుక కథ ఇదేనా?