Telangana News: కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు సీఎం రేవంత్ రెడ్డి కుర్చీ ఖాళీ అవుతుందని వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు కేసీఆర్ అసెంబ్లీలోకి ఎంట్రీ ఇస్తారని, అప్పుడు రేవంత్ కుర్చీలో నుంచి ఎగిరిపోతాడని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పటికీ వాటిని అమలు చేయలేదని విమర్శించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేపీ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వంద రోజుల తర్వాత ఆరు గ్యారెంటీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నిజస్వరూపం ఇప్పటికే బయటపడిందని, ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లే ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాపాలన దరఖాస్తుల సంగతేంటి?
రేవంత్ రెడ్డి కూడా ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లు అనుకుంటున్నారని, బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని వివేకానంద గౌడ్ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించిందని, వాటి సంగతేటి? అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ కోరుతుందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమకు ఇప్పుడు ధర్నాలు చేయాలనే తొందర లేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ధర్నాలు చేసే పరిస్థితి తీసుకొచ్చిందని తెలిపారు. ప్రధాని మోదీ ఆశీర్వాదం కోసం రేవంత్ రెడ్డి తాపత్రయ పడుతున్నారని, తన పదవిని కాపాడుకునేందుకు మోదీని పొగుడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు ప్రతిపక్ష నేతల్లా ప్రవర్తిస్తూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తున్నారని అన్నారు.
అప్పుడు ఒకమాట.. ఇప్పుడు ఒకమాట
ఎల్‌ఆర్ఎస్‌పై కాంగ్రెస్ నేతలు అధికారంలోకి రాకముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట మాట్లాడుతున్నారని వివేకానంద గౌడ్ గుర్తు చేశారు. ఉచితంగా క్రమబద్దీకరణ చేపట్టాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఎల్‌ఆర్ఎస్‌పై ప్రభుత్వం కళ్లు తెరిచేలా బీఆర్ఎస్ ధర్నాలు చేస్తుందన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ తీసుకొస్తున్న కాంగ్రెస్ సర్కార్.. మ్యారేజ్ రెగ్యూలేజేషన్ స్కీమ్ కూడా తీసుకొస్తుందా? అని ప్రశ్నించారు. ఎల్‌ఆర్‌ఎస్ పేరిట వసూలు చేస్తున్న ఫీజులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు
కాగా ఎల్‌ఆర్‌ఎస్‌పై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. దీంతో కొద్ది రోజులుగా జిల్లాల్లో గులాబీ శ్రేణులు ఆందోళనలు చేపడుతున్నారు. అందులో భాగంగా అమీర్‌పేటలోని మైత్రివనం దగ్గర హైదరాబాద్ పరిధిలోని నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు, నేతలు నిరసన చేపట్టారు. సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఇంచార్జ్ తలసాని సాయి కిరణ్ ఆధ్వర్యలో జరిగిన ఈ ఆందోళనల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్, కేపీ వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, పద్మారావు గౌడ్, కార్పొరేటర్లు పాల్గొన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో కూడా బుధవారం ఎల్‌ఆర్‌ఎస్‌పై ప్రభుత్వ విధానానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.