BRS MLA Mallareddy went to Bangalore and met with DK Shivakumar :  బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో వారు సమావేశం అయ్యారు. అయితే ఆయనను  పార్టీలో చేర్చుకునేందుకు రేవంత్ రెడ్డి అంగీకరించలేదని తెలుస్తోంది.దీంతో ాయన డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మల్లారెడ్డి , ఆయన కుమారుడు బెంగళూరు వెళ్లి డీకే శివకుమార్ ను కలిశారు. ఈ ఫోటో బయటకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 


 కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్‌ ప్రమాదంలో పడింది. ఆయనకు మెడికల్‌ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీలతోపాటు ఇతర వ్యాపారాలు, ఆస్తులు ఉన్నాయి. వీటికి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. కేసులు కూడా నమోదవుతున్నాయి. మూడు రోజుల కిందట తమ కాలేజీ కోసం ప్రభుత్వ భూమి ఆక్రమించి నిర్మించిన రోడ్డును అధికారులు తొలగించారు. తర్వాత మల్లారెడ్డి అల్లురు మర్రి రాజశేఖర్ రెడ్డి చెరువును ఆక్రమించి కట్టిన ఇంజినరింగ్ కాలేజీ  భవనాలను కూలగొట్టారు.                                                             


మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఉన్న రాజకీయ వైరం, గతంలో రేవంత్‌ రెడ్డిపై ఘాటైన పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో మల్లారెడ్డిని కాంగ్రెస్‌లో చేర్చుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే మల్లారెడ్డి కర్నాటక రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ కీలక నేతతో రాయబారం నడిపానని కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు అంగీకరించారని ఆయన చెబుతూ వస్తున్నారు.  గతంలో ఎంపీగా, మంత్రిగా మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లాను తన గుప్పిట్లో పెట్టుకొని భూములను కారు చౌకగా తన పేరిట, అనుచరుల పేరిట కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి.                                                                    


మేడ్చల్‌ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్టు వార్తలు వస్తుండటంతో ఆ పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్లారెడ్డి వైఖరి నచ్చకనే గత ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి ఎన్నికలలో పోటీ చేసిన కాంగ్రెస్‌ మేడ్చల్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి తోటకూర వజ్రేష్‌ యాదవ్‌, సీనియర్‌ నాయకుడు నక్క ప్రభాకర్‌గౌడ్‌ మల్లారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మల్లారెడ్డి పార్టీలో చేరడమే కాంగ్రెస్ తరపున తన కుమారుడు భద్రారెడ్డిని మల్కాజిగిరి నుంచి  నిలబెడతానని అంటున్నట్లుగా తెలుస్తోందీ.