BRS MLA Kotha Prabhakar Reddy on encroachment Case:  హైదరాబాద్‌లోని దుర్గం చెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైడ్రా  ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు భారతీ న్యాయ సంహిత సెక్షన్లతో పాటు, ప్రభుత్వ ఆస్తుల నష్టం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యేతో పాటు వెంకట్ రెడ్డి అనే మరో వ్యక్తిని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు.

Continues below advertisement

హైడ్రా ఫిర్యాదు ప్రకారం.. 2014లోనే హెచ్‌ఎండీఏ దుర్గం చెరువుకు సంబంధించి ఎఫ్‌టీఎల్ ప్రాథమిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయినప్పటికీ, నిందితులు దాదాపు 5 ఎకరాల చెరువు శిఖం భూమిని మట్టి ,  రాళ్లతో నింపి ఆక్రమించారు. ఈ ఆక్రమిత స్థలాన్ని ఎస్టీఎస్  ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ పార్కింగ్ కోసం వినియోగిస్తూ అక్రమంగా డబ్బు సంపాదిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.  దుర్గం చెరువు ఆక్రమణలు 2014 నుంచే కొనసాగుతున్నాయని, దీని ద్వారా నిందితులు నెలకు సుమారు 50 లక్షల రూపాయల వరకు అక్రమ ఆదాయం గడిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మాదాపూర్ ఇన్-ఆర్బిట్ మాల్ సమీపంలోని ఈ స్థలంలో ఐటీ కంపెనీలు ,  పాఠశాలల వాహనాల పార్కింగ్ నిర్వహిస్తున్నారు.  ఇటీవల హైడ్రా నిర్వహించిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ 5 ఎకరాల అక్రమ ఆక్రమణలను తొలగించి, చెరువు భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే దుర్గం చెరువుకు సంబంధించి తనపై వస్తున్న ఆక్రమణ ఆరోపణలను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు.  తాను ఎలాంటి ప్రభుత్వ భూమిని గానీ, చెరువు భూమిని గానీ ఆక్రమించలేదని తెలిపారు. సంబంధిత భూమి పూర్తిగా తమ స్వంతమైందని, ప్రజల అవసరాల దృష్ట్యా వాహనాల పార్కింగ్ కోసం మాత్రమే వినియోగించుకునేలా ఇచ్చినట్టు పేర్కొన్నారు.  ఆ భూమిని గతంలో ఆక్షన్ ద్వారా చట్టబద్ధంగా కొనుగోలు చేశామని, సుమారు ఎనిమిదేళ్ల క్రితమే టీడీఆర్ కూడా మంజూరు అయిందని తెలిపారు. అదే ప్రాంతంలో హీరో బాలకృష్ణ , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడికి కూడా భూములు ఉన్నాయన్నారు.  దుర్గం చెరువులో తాను ఐదు ఎకరాల భూమిని కబ్జా చేశానని కేసులు పెట్టారని, అయితే వాస్తవానికి అక్కడ తమకూ, ప్రభుత్వానికీ గజం జాగా కూడా లేదని స్పష్టం చేశారు. 

హైడ్రా అధికారులకు ఎవరో ఫిర్యాదు చేశారని సిబ్బంది సమాచారం ఇచ్చారని, తాను స్వయంగా అక్కడికి వెళ్లి పరిశీలిస్తానని చెప్పారు.  అదే ప్రాంతంలో ఉన్న మరో భూమిని తాను 2004లో కొనుగోలు చేశానని, అది FTL పరిధిలో ఉందని తెలిసిన వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించానని తెలిపారు. తనపై కావాలనే రాజకీయ ఉద్దేశాలతో తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తూ, “వారి వద్ద నిజమైన ఆధారాలు ఉంటే ప్రజల ముందుకు చూపించాలి” అంటూ కొత్త ప్రభాకర్ రెడ్డి  సవాల్ విసిరారు.