BRS MLA Danam Nagender is ready to Join Congress : బీఆర్ఎస్ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు.  లోక్ సభ ఎన్నికలకు ముందే… గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరు తప్ప అందరూ కాంగ్రెస్ లో చేరిపోయేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారన్న ప్రచారం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి దానం నాగేందర్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ.. రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆయన కాంగ్రెస్ ఇంచార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ సహా సీనియర్ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.   అధికారం లేకపోతే… హైదరాబాద్ లో చిన్న పని కూడా చేయించలేమని దానం భావిస్తున్నారని ్ంటున్నారు.  దానం బీఆర్ఎస్ లో పుట్టి పెరగలేదు. ఆయన ఉద్యమకారులను వెంటపడిన రోజులు ఉన్నాయి. కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్,…బీఆర్ఎస్ అంటూ ఆయన పయనం సాగుతోంది. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ లోకి ఎంట్రీ ఇచ్చే చాన్సులు కనిపిస్తున్నాయి.



దానం నాగేందర్ సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయన హైదరాబాద్ మొత్తం  చక్రం తిప్పారు. మంత్రిగా ఆయన ఏం చెబితే అది జరిగేది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ మంత్రిగా ఉన్నారు.  రాష్ట్ర విభజన తర్వాత ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసినా..  టీడీపీతో  పొత్తులో భాగంగా పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు తర్వాత  బీఆర్ఎస్ లో చేరి.. 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. గతంలో ఓ సారి కాంగ్రెసె టిక్కెట్ నిరాకరించడంతో టీడీపీలో చేరి పోటీ చేసి విజయం సాధించారు. తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి  రావడంతో మళ్లీ టీడీపీకి రాజీనామా చేసి.. కాంగ్రెస్ పార్టీలో చేరారు.                    


ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. గ్రేటర్ పరిధిలో ఎమ్మెల్యేలను చేర్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు ఇద్దరూ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే చాలన్నట్లుగా రెడీగా ఉన్నారు. సమయం చూసి అందర్నీ ఒకే సారి పార్టీలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయన్న  ప్రచారం జరుగుతోంది.                                                


గతంలో రెండు సార్లు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను బీఆర్ఎస్ లో కేసీఆర్ విలీనం చేసుకున్నారు. ఈ సారి బీఆర్ఎస్ లెజిస్లేచర్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసుకుంటారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.