నేడు బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ జనరల్ బాడీ మీటింగ్ జరగనుంది. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌గా మారిన తర్వాత జరుగుతున్న తొలి జనరల్ బాడీ మీటింగ్ ఇదే. ఈ సమావేశానికి 279 మంది ప్రతినిధులకు ఆహ్వానం అందింది. నేడు (ఏప్రిల్ 27) ఉదయం 11 గంటలకు జనరల్ బాడీ సమావేశం ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఉదయం 11 గంటలకు పార్టీ జెండాను ఎగరేసి సీఎం కేసీఆర్ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు ఈ సమావేశానికి హాజరు అవుతారు.


బీఆర్‌ఎస్‌ జాతీయ పార్టీగా అవతరించినా సర్వసభ్య సమావేశానికి మాత్రం రాష్ట్రానికి చెందిన వారినే ఆహ్వానించారు. కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఈ మహా సభలో పలు రాజకీయ తీర్మానాలను ప్రవేశపెట్టి విస్తృతంగా చర్చించి ఆమోదించేలా ఎజెండాను రూపొందించారు. రైతుబంధు సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి నేతృత్వంలోని బృందం ప్రవేశపెట్టే తీర్మానాలపై కసరత్తు చేస్తోంది. అయితే, దీనిపై నేడు స్పష్టత వస్తుందని బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. వ్యవసాయం, సంక్షేమం, గ్రామీణ ప్రగతి - పట్టణ ప్రగతి, విద్య - ఉపాధి, బీజేపీ వైఫల్యాలు, స్థానిక సమస్యలపై తీర్మానాలు ఆమోదిస్తారని తెలుస్తోంది. ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ తీర్మానాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.


అక్టోబర్ 10న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ గతంలోనే ప్రకటించిన వేళ రానున్న రోజుల్లో జరిగే సభలపై ఓ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ, 2024 పార్లమెంటు ఎన్నికలే లక్ష్యంగా పార్టీ నేతల్లో కేసీఆర్ కొత్త ఉత్సాహాన్ని నింపనున్నారు.


ఆవిర్భావ దినోత్సవం నాడు కేటీఆర్ శుభాకాంక్షలు


భారత రాష్ట్ర సమితి 22వ ఆవిర్భావ దినం సందర్భంగా ఆ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కేటీఆర్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. రెండు దశాబ్దాల క్రితం ఉద్యమ పార్టీగా పురుడుపోసుకున్న టీఆర్ఎస్ (బీఆర్‌ఎస్‌), తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్ఠించిందని చెప్పారు. తక్కువ కాలంలోనే సీఎం కేసీఆర్‌ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపారని అన్నారు. 22 ఏళ్లుగా పార్టీ ప్రస్థానంలో అండగా ఉన్న అందరికి ధన్యవాదాలు తెలిపారు.


‘‘రెండు దశాబ్దాల క్రితం ఉద్యమపార్టీకి పురుడు పోసి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని పునఃప్రతిష్టించి, అనతికాలంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన నేత మన కేసీఆర్ 22 ఏండ్ల ప్రస్థానంలో నాటి నుంచి నేటి వరకు భారత రాష్ట్ర సమితికి అండగా ఉంటున్న పార్టీ శ్రేణులకు, తెలంగాణ ప్రజలకు పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు’’ అని బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం ఒక ట్వీట్ చేశారు.