KCR Bus Yatra in Khammam: తెలంగాణలో వరి పంట పంజాబ్ తో పోటీ పడే స్థితిలో 3.5 కోట్ల టన్నుల ధాన్యం పండించామని మాజీ సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. ఆ సమయంలో ధాన్యం కొనుగోలు కోసం ఎంపీ నామా నాగేశ్వరరావు అధ్వర్యంలో కేంద్ర పెద్దలను అడిగితే కేంద్రం కొనలేదని.. పైగా కేంద్రమంత్రి నూకలు తినమని ఎద్దేవా చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. గోదావరి నీళ్లను కేంద్రం ఎత్తుక పోతానంటే ఇక్కడవున్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోరు తెరుస్తాలేరని విమర్శించారు. మరి ఈ దద్దమ్మలు మనకు ఎందుకని అన్నారు. నేను సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రతిపాదనను మోదీ తన ముందు పెడితే.. తన తల తెగిపడ్డా ఒప్పుకోనని చెప్పానని గుర్తు చేశారు.


ఎవరికీ మెజారిటీ రాదు
‘‘బీజేపీకి 200 సీట్లు కూడా వస్తలేవు అంతా ఉత్తదే. దాదాపు 12 పార్లమెంటు సీట్లు మనం గెలువబోతున్నాం. ఏ కూటమికి మెజారిటీ రాట్లేదు. మనం ఎక్కువ ఎంపీలను గెలిస్తే రాబోయే సంకీర్ణ ప్రభుత్వంలో నామ నాగేశ్వర్ రావు కేంద్రమంత్రి అయితాడు. మన గోదావరి కృష్ణా నదులను ఇంకా అనేకమైన మన హక్కులను మనం కాపాడుకోవాలంటే బీఆర్ఎస్ నే గెలిపించుకోవాలి. దీక్ష సమయంలో ఖమ్మం నాకు అండగా నిలిచింది. అన్ని సంఘాలు వర్గాలు నాకు మద్దతినిచ్చాయి. నేను ఎన్నడూ మర్చిపోను. మన ప్రభుత్వంలో రైతు బంధు ఇచ్చినం.. ధాన్యం కొన్నాం.. కరెంటు ఇచ్చినం.. రైతుకు వ్యవసాయానికి ఎంతో చేసినం. దున్నేవానికి భూమి తినేవానికి ఇస్తారాకు గీకిటోనికే గుండు అని ఎన్నో నినాదాలు తెచ్చిండ్రు కమ్మునిస్టులు.


ఎన్టీఆర్ ను మించిన సంక్షేమం
కానీ వీరెవరూ చేయని సంక్షేమాన్ని కేవలం ఆనాడు ఎన్టీఆర్ మహానీభావుడు చేసి చూయించిండు. ఎన్టీఆర్ వచ్చినంకనే మనందరికీ రెండు రూపాయలకు కిలో బియ్యం ఇంకా అనేక పథకాల ద్వారా సంక్షేమం అందించిండు. ఎన్టీఆర్ తర్వాత మన తెలంగాణ ప్రభుత్వంలో ఎన్టీఆర్ ను మించి సంక్షేమం అమలు చేసుకున్నాం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అలవిగాని హామీలిచ్చింది. ఇప్పడు ఇచ్చిన హామీలన్నీ ఎటుబాయే? తులం బంగారం తుస్సు మన్నది, అడిగితే కాంగ్రెస్ కస్సు మంటున్నది. కరెంటు ఎటుపోయింది. మొన్న మహబూబ్ నగర్లో కరెంటు పోయిందంటే భట్టి విక్రమార్క పోలేదు అంటుండు.


ఉస్మానియా యూనివర్సిటీకి నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు. పిల్లలు రోడ్లమీదికి వచ్చి లొల్లి పెడుతండ్రు. ఇది నేను ట్విటర్ లో పెట్టిన. నాడు మన ప్రభుత్వంలో నిత్యం వరి కోతలు వుంటుండే, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో నిత్యం కరెంటు కోతలు ఉంటున్నాయి. మోసపూరిత హామీలిచ్చి అమలు చేయకుండా.. ఓట్ల కోసం తిరుగుతున్నావు. ఎందరు దేవుండ్లమీద ఒట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? రుణమాఫీ ఆరు గ్యారెంటీలు ఆగస్టు 15 కల్లా గనుక అమలు చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తానంటే సీఎం ఎందుకు పోలేదు?


మహిళకు రూ.2500 ఇస్తామన్నారు ఏమైనాయి? ఇచ్చిండ్రా? హామీలు అమలు చేయమని అంటే.. నీ గుడ్లు పీకి గోళీలు ఆడుకుంటా.. పండబెట్టి తొక్కుతా.. నీ పేగులు దీసి మెడల ఏసుకుంటా.. నిన్ను చర్లపెల్లి జైళ్లేస్తా అని కూతలుకూస్తుండు ఒక ముఖమంత్రి ఇట్లా మాట్లాడొచ్చా? తెలంగాణ సాధించిన నన్ను పట్టుకుని అడ్డగోలుగా తిడుతుండు.. ఈ భాషేంది? నేను జైళ్లకు తోకమట్టకు భయపడితే తెలంగాణ వచ్చునా? ఎన్నికలు అయిపోయిన తెల్లారి రేవంత్ బీజేపీలోకి జంప్ కొడుతాడని మేం అంటుంటే.. సీఎం ఒకసారి కూడా స్పందిస్తాలేదు కారణం ఏంటి? రైతులు పంటలు ఎండబెట్టిండ్రు తప్ప నీళ్లు ఇవ్వలే. యుద్ధం జెద్దామా పోరాడుదామా? కాంగ్రెస్ అడ్డగోలు హామీలను సాధిద్దాం.  ప్రభుత్వాల సపోర్టు లేకుండా ఏ దేశంలో కూడా వ్యవసాయం నడువదు. 25 ఎకరాల మీద రైతుబంధు ఆపుతానంటే అదొక తీరు గానీ.. ఐదెకరాలకంటే ఎక్కువ ఇయ్యను అంటే ఎట్లా?


కాంగ్రెస్ మెడలు వంచాలంటే బీఆర్ఎస్ కు బలం ఇయ్యాలి. మల్లా వాటర్ టాంకర్లు వచ్చే దుర్గతి ఎందుకొస్తాంది? కేసీఆర్ పక్కకు జరుగంగానే నీళ్లు ఆగిపోతాయా? యువత ఒక ఒరవడిలో కొట్టుకు పోకుండా ఆలోచించాలి భవిత మీదే. కేంద్రాన్ని కూడా నిలదీద్దాం. బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్టే. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపించాలి’’ అని కేసీఆర్ పిలుపు ఇచ్చారు.